బోటులో అగ్నిప్రమాదం- డ్రైవర్‌ సజీవ దహనం

ప్రజాశక్తి – యానాంయానాంలోని దరియాలతిప్ప వద్ద ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బోటు డ్రైవర్‌ సజీవ దహనమయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు… దరియాలతిప్ప జెట్టీ వద్ద కామాడి నాగేశ్వరరావుకు సంబంధించిన బోటులో ముగ్గురు కార్మికులు వెల్డింగ్‌ పని చేస్తున్నారు. ఈ సమయంలో బోటులో డీజిల్‌ ఉండడంతో నిప్పురవ్వలు పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు బోటు లోపలి నుంచి బయటకు వచ్చేశారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ సమయంలో ఒడ్డున ఉన్న నాగేశ్వరావు సోదరుడు, బోటు డ్రైవర్‌ కామాడి గంగాద్రి (40) మంటలను ఆర్పేందుకు బోటులోకి వెళ్లారు. మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే గంగాద్రి మరణించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యానాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

➡️