సమాజాన్ని మార్చేలంటే పుస్తకాలు చదవాలి

  •  మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఇంతియాజ్‌ అహ్మద్‌
  • విజయవాడలో పుస్తక ప్రియుల పాదయాత్ర

ప్రజాశక్తి – విజయవాడ ఎడ్యుకేషన్‌ : సమాజాన్ని మార్చాలంటే పుస్తకాలు చదవాలని మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఇంతియాజ్‌ అహ్మద్‌ అన్నారు. 34వ విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా సోమవారం ‘పుస్తక ప్రియుల పాదయాత్ర’ నిర్వహించారు. సిద్ధార్థ ఆర్ట్స్‌ కళాశాల వద్ద పాదయాత్రను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి.సిసోడియా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్రకు ప్రముఖ విద్యావేత్త పరిమి నాయకత్వం వహించారు. పాదయాత్ర ఐదో నంబరు రోడ్డు మీదుగా పుస్తక మహోత్సవ ప్రాంగణానికి చేరుకుంది. అనంతరం కేతు విశ్వనాథరెడ్డి సాహితీవేదికపై నిర్వహించిన ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఇంతియాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికీ సమాజంపై తనదైన ముద్రవేయాలని, మంచి మార్పులు తేవాలని ఉంటుందని, కానీ ఆ ఆకాంక్షలను నిజం చేసుకోవాలంటే కావాల్సిన అవగాహన, మార్గదర్శనం మంచి పుస్తకాలలోనే లభిస్తాయని తెలిపారు. తాను ఐఎఎస్‌ అధికారి కావడానికి పుస్తకాలు చదివే అలవాటుండటమే కారణమని చెప్పారు. పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవడం ద్వారా పిల్లలు తమ జీవితాలను తాము కోరుకున్నట్లు మలుచుకోవచ్చని తెలిపారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ.. పుస్తకం ఉన్న ఇల్లు విద్యాభివృద్ధికి నిలయమన్నారు. పిల్లలకూ పుస్తకాలకూ ఉన్న అనుబంధం మార్కులకూ, హోం వర్కులకూ పరిమితం చేయకూడదన్నారు. జాషువా, శ్రీశ్రీలాంటి కవుల రచనలు, మహాత్మాగాంధీ, అంబేద్కర్‌ జీవితాలను అధ్యయనం చేయాలని కోరారు. విద్యావేత్త పరిమి మాట్లాడుతూ.. కనీసం ప్రాథమిక పాఠశాల స్థాయి వరకూ అయినా మాతృభాషలో చదువుకునే అవకాశం లేకపోవడం తెలుగు పిల్లల దురదృష్టమన్నారు. పుస్తకమహోత్సవం వల్ల పుస్తకాలతో పిల్లలకు అనుబంధం పెంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ మాజీ అధ్యక్షులు వెంకట నారాయణ మాట్లాడుతూ.. రోజురోజుకూ పుస్తక పాఠకుల సంఖ్య తగ్గడం దురదృష్టమన్నారు. వ్యవస్థలో కీలకస్థానాల్లో ఉన్న వ్యక్తులు పుస్తకాలకున్న స్థానాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల సమాజానికి పరోక్షంగా చాలా నష్టం జరుగుతోందని చెప్పారు. మేథావులు, ప్రభుత్వాలు ఈ సమస్యను పట్టించుకుని పరిష్కారాలను ఆలోచించాలని కోరారు. పుస్తకమహోత్సవ సంఘం అధ్యక్షులు మనోహర్‌ నాయుడు, కార్యదర్శి కె.లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️