విజయవాడలో విషాదం

Apr 30,2024 23:28 #5 death, #crime, #Vijayawada
  • ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
  • నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్‌
  • ఆర్థిక ఇబ్బందులే కారణంగా భావిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి- విజయవాడ అర్బన్‌ : విజయవాడ నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఓ డాక్టర్‌ తన నలుగురు కుటుంబ సభ్యులను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని గురునానక్‌ కాలనీలో ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు డాక్టర్‌ డి.శ్రీనివాస్‌ (40)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబంతోపాటు తల్లి కూడా ఆయన వద్దే ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఇంటికి వెళ్లిన పని మనిషికి బాల్కనీలో శ్రీనివాస్‌ ఉరి వేసుకుని ఉండడం చూసి చుట్టుపక్కల వారికి చెప్పింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు లోపలకు వెళ్లి చూడగా శ్రీనివాస్‌ ఉరికి వేలాడుతూ కనిపించారు. ఆయన భార్య ఉష (38), కుమార్తె శైలజ (9), కుమారుడు శ్రీహాన్‌ (8), తల్లి రమణమ్మ (65) రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వారి గొంతుకలు కోసి ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల డాక్టర్‌ శ్రీనివాసే కుటుంబ సభ్యులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు?
డాక్టర్‌ శ్రీనివాస్‌ గుంటూరు మెడికల్‌ కళాశాలలో ఎంబిబిఎస్‌ పూర్తి చేశారు. అనంతరం సూపర్‌ స్పెషాలిటీ కోర్సును అభ్యసించారు. నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో కొన్నేళ్లు వైద్యులుగా సేవలందించారు. ఏడాది క్రితం సొంతంగా పుష్పా హోటల్‌ సెంటర్‌ సమీపంలో శ్రీజ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రి సరిగా నడవకపోవడం, ఇతర కారణాలతో అప్పులు పెరిగిపోవడంతో డిప్రెషన్‌కులోనై అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులను చంపి, తెల్లవారు జామున డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ హెచ్‌డిఎఫ్‌ రామకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. డాక్టర్‌ శ్రీనివాస్‌ తన ఇంటి ఎదురుగా ఉన్న మరొకరి ఇంటి పోస్టు బాక్సులో ‘నా కారు తాళం నా అన్నకు ఇవ్వాలి’ అని రాసిన లెటర్‌ ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఇది ఆత్మహత్యకు ముందు రాసిన లెటర్‌గా భావిస్తున్నారు.

➡️