దిగ్గజ కంపెనీ టెస్లాను తెలంగాణకు రప్పించండి : కెటిఆర్‌

Apr 5,2024 08:50 #company, #KTR, #Telangana, #Tesla

తెలంగాణ : ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో ప్రపంచ దిగ్గజ కంపెనీ టెస్లాను తెలంగాణకు రప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టెస్లా బృందాన్ని ఆహ్వానించి, ఇక్కడి ప్రగతిశీల పారిశ్రామిక విధానాలపై వారికి అవగాహన కల్పించాలని ఎక్స్‌ వేదికగా సూచించారు.

టెస్లా కంపెనీ భారత్‌లో రెండు నుంచి మూడు బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ముందుకొచ్చిందని, ఇందుకు దేశంలో సరైన ప్రాంతాన్ని అన్వేషిస్తున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో టెస్లాను హైదరాబాద్‌కు తెచ్చేందుకు ప్రభుత్వం కఅషి చేయాలన్నారు. గత కెసిఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక అనుకూల విధానాలతో పెద్ద ఎత్తున దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. ఎలక్ట్రిక్‌ కార్ల పరిశ్రమ ఏర్పాటుకూ రాష్ట్రంలో తగిన ఎకోసిస్టం ఉన్నదని పేర్కొన్నారు. అమరరాజా కంపెనీ మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ స్థాయిలో బ్యాటరీల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నదని, మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ ట్రాక్టర్లు, కమర్షియల్‌ వాహనాల తయారీ పరిశ్రమను జహీరాబాద్‌లో నిర్వహిస్తున్నదని, అదే ప్రాంతంలో హ్యుందయ్ కంపెనీ రూ.1,400 కోట్ల పెట్టుబడితో టెస్టింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నదని వివరించారు. ఈ నేపథ్యంలో టెస్లా వంటి కంపెనీ రాకతో రాష్ట్రంలో ఆటోమొబైల్‌ రంగానికి, ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

➡️