అంగన్‌వాడీలకు విశాల మద్దతు

Dec 18,2023 10:43 #Anganwadi strike
  • సమ్మె శిబిరాల్లో చిన్నారులు, తల్లిదండ్రులు

ప్రజాశక్తి- యంత్రాంగం : అంగన్‌వాడీల నిరవధిక సమ్మె ఆరో రోజూ కొనసాగింది. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో తహశీల్దార్‌, ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్ద వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. వారి ఆందోళనకు విశాల మద్దతు లభించిది. అంగన్‌వాడీల చిన్నారులు, వారి తల్లిదండ్రులు మద్దతు తెలిపారు. సమ్మె శిబిరాల్లో వారు కూడా కూర్చున్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, మహిళలు ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ దృశ్యాలు కనిపించాయి. పలు జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను ఆమోదించి సమ్మెను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ‘జగన్‌ మావయ్య… మా ఆయమ్మకు జీతాలు పెంచండి ప్లీజ్‌’ అంటూ ఓ చిన్నారి పలకపై రాసి బాపట్ల జిల్లా చీరాలలోని అంగన్‌వాడీ సమ్మె శిబిరంలో ప్రదర్శించింది. ఆదివారం కూడా అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టడానికి అధికారులు ప్రయత్నించారు. వీటిని ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లిలో ఐసిడిఎస్‌ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ చిన్నగొల్లపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని అధికారులు తెరిచారు. ఈ చర్యను స్థానికులు నిరసించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అన్నపూర్ణ థియేటర్‌ సమీపంలోగల అంగన్‌వాడీ కేంద్రం తాళాలు పగల గొట్టడానికి వచ్చిన అధికారులను ప్రజలతో కలిసి అంగన్‌వాడీలు, సిపిఎం నాయకులు అడ్డుకున్నారు. దీంతో, అధికారులు వెనుదిరిగారు. మంగళగిరి మండలం ఆత్మకూరు అంగన్‌వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టడానికి వచ్చిన సచివాలయ సిబ్బందిని ప్రజాసంఘాల నాయకులు అడ్డుకున్నారు. తాళాలు పగలగొట్టనీయకుండా ఉండవల్లిలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఉన్న సిపిఎం, టిడిపి, జనసేన, అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

➡️