బిఆర్‌ఎస్‌ స్వేదపత్రం.. ప్రజెంటేషన్‌

Dec 24,2023 12:16 #KTR

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘స్వేదపత్రం విడుదల చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పారు. గత పాలకులు ఉద్దేశపూర్వకంగా జీవన విధ్వంసం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో అన్నీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని అసహనానికి గురయ్యారు. గతంలో ఏటా పాలమూరు నుంచి 14 లక్షల మంది వలసవెళ్లే వారని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీఆర్‌ఎస్‌ను బద్నాం చేస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రంలో పేర్కొన్న అప్పుల గురించి ప్రస్తావిస్తూ..

తెలంగాణ మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లని చెప్పడం పూర్తిగా అబద్దమని కేటీఆర్ చెప్పారు. 2014-15 నాటికి రాష్ట్ర రుణం రూ.72,658 కోట్లు ఉండగా.. ప్రస్తుతం తెలంగాణ అప్పు 3.17 లక్షలకు చేరిందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులను, జరిగిన అభివృద్ధిని పోల్చి చూడాలని హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలతో ప్రత్యేక రాష్ట్రంలో పేదరికం తగ్గి తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. 2013లో తెలంగాణ ప్రాంతంలో పేదరికం 21 శాతం ఉండగా.. 2023 నాటికి ప్రత్యేక రాష్ట్రంలో పేదరికం 5శాతానికి తగ్గిందని వివరించారు. 2014లో  1.14 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం ప్రస్తుతం 3.17 లక్షలకు చేరిందని కేటీఆర్ తెలిపారు.

➡️