తెలుగు రాష్ట్రాల్లో మండుతోన్న ఎండలు

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎపిలో ఎండల తీవ్రత మధ్యాహ్నా వేళల్లో అధికమవుతోంది. విపరీతమైన ఉక్కపోతతో  ప్రజలు మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు వీలైనంత వరకు ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా మరోవైపు … తెలంగాణలో మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా అక్కడ పొడి వాతావరణం ఉండగా.. మంగళవారం ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. రాష్ట్ర అభివఅద్ధి, ప్రణాళికా సంస్థ ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. ఆరుబయట పనిచేసే వారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదయ్యాయి. నిన్న తలమడుగు, జైనథ్‌ మండలాల్లో గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదనైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌లో 42 డిగ్రీలు నమోదయింది. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు కూడా సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవటమే మంచిదని చెబుతున్నారు. కాటన్‌ దుస్తులు ధరించాలని.. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, తలపై టోపీ వంటి ధరించాలని చెబుతున్నారు. వడదెబ్బకు గురి కాకుండా నీళ్లు ఎక్కువగా తాగాలని.. పండ్ల రసాలతో పాటు కొబ్బరినీళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. మసాలా ఫుడ్స్‌కు దూరంగా ఉండి తేలికైన ఆహారం తీసుకోవాలని అధికారులు సూచించారు.

➡️