సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించం : అంగన్‌వాడీలు 

Jan 17,2024 10:44 #Anganwadis, #call, #issues, #resolved, #strike
  • ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం
  • 36వ రోజుకు చేరిన అంగన్‌వాడీల నిరసనలు

ప్రజాశక్తి-యంత్రాంగం : వేతనాలు పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 36వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ వైఖరిని నిరసనగా ముగ్గులు వేస్తూ, పిండి వంటలు వండుతూ, గుంజీలు తీస్తూ, సాష్టాంగ నమస్కారాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు. పలుచోట్ల సంతకాల సేకరణ చేపట్టారు. ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. పాలకుల మొండి వైఖరికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు..ప్రకాశం జిల్లా ఒంగోలులో అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సందర్శించి మద్దతు తెలిపి మాట్లాడారు. తొలుత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గారెలు వండి నిరసన తెలిపారు.

అనంతరం కోటి సంతకాల సేకరణలో భాగంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద అంగన్‌వాడీలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నూతన వస్త్రాలు సమర్పించారు. ‘రాజన్నా.. నీ బిడ్డ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి బుద్ధులు ప్రసాదించి అంగన్‌వాడీల జీతాలు పెంచే విధంగా చూడు’ అని వేడుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. అనకాపల్లిలో ముగ్గులు వేసి, పాటలు పాడుతూ, దేవరాపల్లిలో ఆకులు చేతిలో పట్టుకుని ప్రదర్శనలు చేశారు. సబ్బవరంలో అంగన్‌వాడీల సమ్మెకు సిపిఎం నేతలు మద్దతు తెలిపారు. అల్లూరి జిల్లాలో అన్ని సమ్మె శిబిరాల వద్ద ముగ్గులు వేసి, గిరిజన సంప్రదాయ నృత్యాలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో గుంజీలు తీస్తూ నిరసన తెలిపారు. డిప్యూటీ సిఎం రాజన్నదొరకు వినతిపత్రం అందజేశారు. పార్వతీపురంలో సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే జోగారావుకు అంగన్‌వాడీలు వినతి పత్రం అందజేసి తమ సమస్యలు విన్నవించారు. కురుపాంలో గంగిరెద్దుకు వినతినిచ్చారు.

ప్రకాశం జిల్లా వెలిగండ్లలో వంటా వార్పు చేశారు. యర్రగొండపాలెంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాలపర్తి డేవిడ్‌రాజు సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు. కొండపిలో రోడ్డుపై సంక్రాంతి ముగ్గులు వేశారు. నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని వారి వారి క్యాంపు కార్యాలయాల్లో కలిసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట దీక్షా శిబిరంలో మట్టి తిని నిరసన తెలిపారు. బుక్కరాయసముద్రంలో ఎస్మా ప్రతులను దగ్ధం చేశారు. గుమ్మఘట్ట, గుంతకల్లులో గంజి తాగి నిరసన చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో రొట్టెలు కాలుస్తూ నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు ధర్నా చౌక్‌లో మోకాళ్లపై నిలబడి, ఆదోనిలో ఎస్మా కాపీలను దగ్ధం చేసి నిరసన తెలిపారు.

నంద్యాలలో గాలిపటాలు ఎగరేస్తూ, ఆత్మకూరులో కళ్లకు గంతలు కట్టుకుని, బండి ఆత్మకూరులో పచ్చిగడ్డి తింటూ, బేతంచెర్లలో విస్తరాకుల్లో మట్టి తింటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలోని సింగ్‌నగర్‌ మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో వాకర్స్‌తో, మైలవరంలో పాత పోలీస్‌ స్టేషన్‌ వద్ద సంతకాలు సేకరించారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరంలో అంగన్‌వాడీలు గంజి తాగి నిరసన తెలిపారు. దీక్షా శిబిరాన్ని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌.నాగబ్రహ్మాచారి పాల్గొని సంఘీభావం తెలిపారు. పెదనందిపాడులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి ప్రారంభించి సంఘీభావం తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఉరివేసుకుని నిరసన తెలిపారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద జగనన్నకు సాష్టాంగ నమస్కారాలు చేశారు. కుక్కునూరులో పిండి వంటలు చేసి, జీలుగుమిల్లిలో కుర్చీలాట ఆడారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గడ్డి తింటూ, వీరవాసరంలో మంత్రుల మాస్కులు ధరించి తాడు లాగే ఆట ఆడుతూ నిరసన తెలిపారు. పలుచోట్ల సంతకాలు సేకరించారు. పోడూరులో పిండి వంటలు చేసి నిరసన వ్యక్తం చేశారు. భీమవరం మండలం బేతపూడిలో అంగన్‌వాడీ కార్యకర్త మరియమ్మ గుండెపోటుకు గురవ్వడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పిండి వంటలు చేశారు. మండపేటలో హరిదాసు వేషధారణలో నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ వెళ్లి సంతకాలను సేకరించారు. తూర్పుగోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాలో సమ్మెను కొనసాగించారు.

➡️