కలిసి నడుస్తాం 

Feb 29,2024 07:54 #JanaSena, #meeting, #TDP
Chandrababu and Pawan Kalyan in Tadepalligudem Sabha
  • తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ 

పొగడ్తల జోరు…విమర్శల హోరు 

రాష్ట్ర సమస్యల ఊసే లేని ప్రసంగాలు 

 టిక్కెట్లు రాని వారికి న్యాయం చేస్తామని హామీ

ప్రజాశక్తి-తాడేపల్లి గూడెం నుండి ఎం. శివాజి : రాష్ట్రం కోసమే కలిసి నడుస్తున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. సీట్ల పంపకానికి సంబంధించిన అధికారిక ప్రకటన అనంతరం టిడిపి, జనసేన ఉమ్మడిగా మొదటిసారి నిర్వహించిన ‘తెలుగు జన విజయకేతనం జెండా సభ’ బుధవారం తాడేపల్లిగూడెంలో జరిగింది. పెద్ద సంఖ్యలో ఉభయపార్టీల కార్యకర్తలు హాజరైన ఈ సభలో వారు మాట్లాడుతూ ప్రజలు కూడా తమతో చేతులు కలపాలని కోరారు. రెండు పార్టీల పొత్తు గురించి పరస్పరం పొగడుకున్న నేతలు రాష్ట్ర ప్రభుత్వంపైనా, వైసిపి పైనా పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురింపించారు. అదే సమయంలో రాష్ట్రానికి అత్యంత కీలకమైన పలు సమస్యల గురించి ప్రస్తావించలేదు. ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, కడప ఉక్కు సాధన అంశాల జోలికి పోకుండా ఇరువురు నేతలు ప్రసంగించారు. ఒకటి, రెండు అంశాలను నామమాత్రంగా ప్రస్తావించినప్పటికీ జగన్‌ ప్రభుత్వ వైఫల్యాన్ని విమర్శించేందుకే సరిపెట్టారు తప్ప, రాష్ట్రానికి జరిగిన ఆ అన్యాయాన్ని ఎలా సరిచేస్తారో చెప్పలేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయంలో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మతోన్మాదం, మైనార్టీల పరిరక్షణ అంశాలను నామమాత్రంగా కూడా చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల ప్రసంగంలో ప్రస్తావనకు నోచుకోలేదు. పైపెచ్చు మోడీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. తొలుత మాట్లాడిన చంద్రబాబు ఆగ్నికి వాయువులాగా తనకు పవన్‌ తోడయ్యాడని చెప్పారు. రెండు పార్టీల పొత్తు సూపర్‌హిట్టని, ఆంధ్రప్రదేశ్‌ అన్‌స్టాపబుల్‌ అని అన్నారు. ‘ ఒకపార్టీ వెనుక మరొకపార్టీ నడవడం లేదు. రెండు పార్టీలు కలిసి నడుస్తున్నాయి’ అని ఆయన అన్నారు. ఐదుకోట్ల మంది ప్రజల భవిష్యత్‌ కోసం తాము చేతులు కలిపామని చెప్పారు. ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన జగన్‌ అధికారంలోకి రాగానే పిడిగుద్దులు గుద్దారని అన్నారు. టిడిపి తీసుకొచ్చిందనే పేరుతో విట్‌, ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలకు రోడ్లు వేయలేదని పేర్కొన్నారు. క్రికెటర్‌ హనుమ విహారిని కూడా వదల్లేదని అన్నారు. చెల్లి, తల్లిపై కూడా సోషల్‌ మీడియాలో విమర్శలు చేయించే దుస్థితికి జగన్‌ వచ్చారని అన్నారు. జగన్‌వైనాట్‌ 175 అంటున్నారని, తాము వైనాట్‌ జాబ్‌ క్యాలెండర్‌, డిఎస్‌సి అంటున్నామని చెప్పారు. కుప్పానికి నీళ్లంటూ ముఖ్యమంత్రి నాటకం ఆడారని, సినిమా సెట్టింగులతో నీళ్లు వదిలారని, మరుసటిరోజు నీళ్లు లేవని చెప్పారు. జగన్‌ విశ్వసనీయత ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. కుప్పంలో తాను లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని చెప్పారు. పొత్తు కారణంగా అందరికీ సీట్లు ఇవ్వకపోవచ్చని, అయితే పనిచేసిన ప్రతి కార్యకర్త, నాయకుడికి న్యాయం చేసే బాధ్యతను ఇద్దరం తీసుకుంటామని చెప్పారు.

  • జగన్‌ మోసం చేశారు : పవన్‌ కల్యాణ్‌

ఐదేళ్ల పాలనలో జగన్‌ యువత, రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలను మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల్లో వైసిపి నేతలు బూతులు తిట్టినా, ఆక్రమణలు చేసినా జెండా కర్రతో మడతపెడతామని హెచ్చరించారు. తన పార్టీకి ఉన్న ఒకేఒక్క ఎమ్మెల్యేను లాక్కున్న జగన్‌ ఒంటరి ఎలా అవుతారని ప్రశ్నించారు. జగన్‌ గోబెల్స్‌ ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. చంద్రబాబు అనుభవం అవసరమనే ఉద్దేశంతో పొత్తు కుదుర్చుకున్నానని చెప్పారు. తనకు, పార్టీకి సలహాలు ఇచ్చేవారు అవసరం లేదని, ఎన్నికల్లో యుద్ధం చేసేందుకు యువకులు కావాలని అన్నారు. అన్ని అర్థం చేసుకునే తాము 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు సీట్లలో పోటీచేస్తున్నామని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో మహాయుద్ధానికి శంఖారావం పూరిస్తున్నామని ప్రకటించారు.. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, నాయకులు బాలకృష్ణ, నిమ్మల రామానాయుడు, ఎంఏషరీఫ్‌, జనసేన నాయకులు కందుల దుర్గేష్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, కొణతాల రామకృష్ణ, ఎంపి రఘురామకృష్ణంరాజు తదితరులు ప్రసంగించారు.

➡️