ఒరిజినల్‌ దస్తావేజులు ఇస్తాం – జిరాక్స్‌ కాఫీలపై చంద్రబాబు దుష్ప్రచారం

May 11,2024 23:23 #ap cm jagan

– పవన్‌ను నమ్మేస్థితిలో మహిళలు లేరు
– చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురం సభల్లో సిఎం జగన్‌
ప్రజాశక్తి – యంత్రాంగం :రాష్ట్రంలో భూముల కొనుగోలు చేసిన వారికి జిరాక్స్‌ కాఫీలు ఇస్తారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సిఎం జగన్‌ ధ్వజమెత్తారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇటీవల పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణ అల్లుడు భూములు కొన్నారని వారికి ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ ఇవ్వలేదా? రాష్ట్రంలో ఎక్కడైనా ఇప్పటివరకు జిరాక్స్‌ కాఫీలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మోసాలను నమ్మొద్దని, 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, మళ్లీ ఇప్పుడు అదే కూటమి మాయమాటలతో ముందుకొచ్చిందని, ఆలోచించి ఓటువేయాలని కోరారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, ఏలూరు జిల్లా కైకలూరు, కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తొమ్మిది లక్షల మందికి ఒరిజినల్‌ డీడ్స్‌ ఇచ్చామని వివరించారు. ప్రతిపక్షంలో ఉండగా పేదల గురించి మాట్లాడతారని, అధికారంలోకి రాగానే కార్పొరేట్ల వైపు చంద్రబాబు చూస్తారని విమర్శించారు. 2014లో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. ఇంటింటికీ వలంటీర్ల ద్వారా పింఛను ఇచ్చే కార్యక్రమాన్ని కోర్టుల ద్వారా చంద్రబాబు నిలిపివేయించడం బాధేస్తోందన్నారు. ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ను మేనేజ్‌ చేసి సంక్షేమ పథకాల సొమ్ములను కూటమి నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. ఎక్కడా వివక్ష లేకుండా వివిధ పథకాల కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇప్పటి వరకూ సొమ్ము జమ చేశామన్నారు. 2.31 లక్షల ఉద్యోగాలు, నాడు-నేడు, విద్యా కానుక, గోరుముద్ద, అమ్మఒడి, జగనన్న తోడు, చేదోడు, లా నేస్తం, 31 లక్షల ఇళ్లపట్టాల పంపిణీ వంటివి ఎప్పుడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. కొల్లేరు సర్వే పూర్తయిందని, నివేదిక వచ్చిన తర్వాత అదనపు భూములు పంచుతామని హామీ ఇచ్చారు. పిఠాపురంలో పోటీ చేస్తున్న దత్తపుత్రుడికి 2014లో టిడిపి, బిజెపి, జనసేన ఇచ్చిన హామీలు గుర్తున్నాయా? అని ప్రశ్నించారు. మహిళలు పవన్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. పిఠాపురం వైసిపి అభ్యర్థి వంగా గీతను భారీ మెజారిటీతో గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెను డిప్యూటీ సిఎంను చేస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యర్థులు తనను అవమానిస్తున్నారని, అవహేళన చేస్తున్నరని వంగా గీత కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయా సభల్లో ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్ధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️