చంద్రబాబు పాలన మొత్తం పాపాల పుట్ట

May 6,2024 12:58 #cm jagan
  • రేపల్లె సభలో సిఎం వైఎస్‌ జగన్‌ విమర్శలు
    బాపట్ల : చంద్రబాబునాయుడు పద్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన కాలమంతా మోసపూరితంగానూ, పాపాల పుట్టగా సాగిందని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి విమర్శించారు. సోమవారం రేపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన పాల్గని ప్రసంగించారు. చంద్రబాబు నాయుడి పేరు చెబితే ఒక్క పథకం, చేసిన మంచి గుర్తుకు రాదని విమర్శించారు. వైసిపి 58 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులెన్నో తీసుకొచ్చామన్నారు. మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుందన్నారు. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావన్నారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు అని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2లక్షల 70 వేల కోట్ల బటన్‌ నొక్కడం..ద్వారా నేరుగా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అయ్యాయన్నారు. ఎక్కడా లంచాలు లేవనీ, వివక్ష లేదనీ, నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులు వెళ్లిపోయాయన్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయన్నారు. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ బడుల్లోని పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బైలింగువల్‌ టెక్స్ట్‌ బుక్స్‌, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో…ఏ అక్కా…ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన.. చదువుల కోసం తెచ్చిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా చూసారా? అని ప్రశ్నించారు. అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని తోడుగా ఉంటూ.. ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వారిపేరిట రిజిస్ట్రేషన్‌ చేయించే కార్యక్రమంతో పాటు అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టామని వివరించారు. అక్కాచెల్లెమ్మల స్వాలంబన, సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ కానుక ఇస్తున్నామన్నారు. ఇంటి వద్దకే పౌర సేవలు, పథకాలు.. ఇవన్నీ ఇంటికే వచ్చే పాలనగానీ, పథకాలుగానీ గతంలో ఎప్పుడైనా చూశారా?. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా రైతుభరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్‌, ఒక ఆర్బీకే వ్యవస్థ…ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని ప్రశ్నించారు. స్వయం ఉపాధికి అండగా తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని ప్రశ్నించారు. పేదవాడు ఆరోగ్యం కోసం అప్పులు పాలవ్వకూడదని… పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్‌. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని ప్రశ్నించారు. గామ సచివాలయ వ్యవస్ధతో గ్రామాల్లో సమూల మార్పులు వచ్చాయన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈవూరు గణేష్‌, ఎంపీ అభ్యర్థిగా నందిగాం సురేష్‌లను గెలిపించాలని కోరారు.
➡️