ప్రాణ నష్టం జరగకుండా చూడాలి

Dec 4,2023 21:46 #cm jagan, #heavy rains, #review, #Tufan
  • అత్యవసర ఖర్చుల కోసం జిల్లాకు రూ.2 కోట్లు
  • గుడిసెలు, ఇళ్లు నష్టపోయిన వారికి రూ.10 వేలు
  • పునరావాస క్యాంపుల్లో అన్ని వసతులూ కల్పించాలి
  • జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా సీనియర్‌ ఐఎఎస్‌లు
  • కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మిచౌంగ్‌ తుపాను వల్ల మనుషులతోపాటు పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కలెక్టర్లు, ఎస్‌పిలు, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తుపాను నేపథ్యంలో చేపడుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలు, ఇతర ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను మంగళవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని ఐఎండి అధికారులు చెబుతున్నారని, గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెబుతున్నారన్నారు. తుపానులో దెబ్బతిన్న గుడిసెలు, ఇళ్లకు తక్షణ సహాయంగా రూ.10 వేలు ఇచ్చి మనావతా దృక్పథంతో సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. వారు కొత్త నివాసం ఏర్పాటు చేసుకునేటట్లు సానుభూతితో సహకారం అందించాలన్నారు. పునరావాస కేంద్రం నుంచి బాధితులు ఇంటికి వెళ్లేటప్పుడు ఒక్కొరికైతే రూ.వెయ్యి, కుటుంబానికైతే రూ.2,500 చొప్పున ఇవ్వాలన్నారు. తుపాను పునరావాస చర్యలు పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకూ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిని నియమించామని, వీరు జిల్లాల్లో యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని, సోమవారం సాయంత్రం నుంచి జిల్లాల్లో అందుబాటులో ఉంటారని సిఎం తెలిపారు. అత్యవసర ఖర్చుల కోసం ప్రతి జిల్లాకూ రూ.2 కోట్లు చొప్పున నిధులివ్వాలని ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. కోతలు వాయిదా వేసుకోవాలితుపాను నేపథ్యంలో కోతలు వాయిదా వేసుకోవాలని రైతులకు తెలపాలన్నారు. ఇప్పటికే కోసిన పంటను కచ్ఛితంగా సేకరించాలని సిఎం సూచించారు. తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎక్కడ అవసరమనుకుంటే అక్కడ వేగంగా పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సిఎంకు అధికారులు వివరణ ఇస్తూ.. ఇప్పటికే 8 జిల్లాల్లో 181 సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 5 ఎన్‌డిఆర్‌ఎఫ్‌, మరో 5 ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక కార్యక్రమాల కోసం సిద్ధంగా ఉన్నాయన్నారు. తుపాను తీరం దాటిన తర్వాత పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ పూర్తి చేయాలని, అందుకోసం కొంత సమయం ఇచ్చిన తర్వాత తాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానని సిఎం అన్నారు. తీవ్ర తుపానుగా మిచౌంగ్‌ : విపత్తుల నిర్వహణ సంస్థ నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతూ మిచౌంగ్‌ తుపాను బలపడిందని, గంటకు ఎనిమిది కిలోమీటర్లు వేగంతో కదులుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మంగళవారం ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్ర తుపానుగా తీరం దాటనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

➡️