మిమ్స్‌ ఉద్యోగులకు సిఐటియు అండ

Feb 16,2024 09:08 #CITU, #Health workers, #Vizianagaram
mims hospital staff protest

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ

ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం జిల్లా) : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల పోరాటానికి సిఐటియు అండగా ఉంటుందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బరావమ్మ స్పష్టం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఆర్‌ఒబి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఉద్యోగులు, కార్మికులు గత 15 రోజులుగా చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని గురువారం ఆమె సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిమ్స్‌ యాజమాన్యం నియంతృత్వ దోరణితో ఉద్యోగులకు డిఎ బకాయిలు చెల్లించకుండా, వేతన ఒప్పందం చేయకుండా వారిని వేధింపులు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గమన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా సేవలు అందించిన ఉద్యోగులు, కార్మికులకు వారి బాగోగులు చూడాల్సిన యాజమాన్యం సమస్యలు పరిష్కరించాలని అడిగితే సస్పెన్స్‌ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మిమ్స్‌ యాజమాన్యం కొండను ఆక్రమించుకొని నిర్మాణాలు చేస్తున్నా అడిగేవారు లేరని, మిమ్స్‌లో నాటి బ్రిటీష్‌ పాలన తలపించేలాఉద్యోగులు, కార్మికులను కట్టు బానిసలుగా చూడడం తగదన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం డిఎ బకాయిల చెల్లించి వేతన ఒప్పందం చేసి సస్పెండ్‌ చేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు, కార్మికులు ఐక్యంగా ఉండాలని సిఐటియు అండగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్య నారాయణ, జిల్లా ప్రధాకార్యదర్శి కె.సురేశ్‌, మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టి.వి.రమణ, సిఐటియు నాయకులు కిల్లంపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.సమస్యలు పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యేమిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడు అన్నారు. గురువారం ఆయన నిరసన శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు సమస్యల వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. రెండు మూడు రోజుల్లో మిమ్స్‌ యాజమాన్యంతో మాట్లాడి చర్చలు జరిపి న్యాయం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గం పరిశీలకులు అందవరపు సూరిబాబు, జడ్‌పిటిసి గదల సన్యాసినాయుడు, వైసిపి మండల అధ్యక్షులు చనమల్ల వెంకట రమణ, నాయకులు చిక్కాల సాంబశివరావు, సముద్రపు రామారావు, కారుకొండ వెంకట కృష్ణారావు, డి.గిరిబాబు, పతివాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️