cm jagan: మాది మహిళా పక్షపాత ప్రభుత్వం

Mar 7,2024 22:12 #ap cm jagan, #released, #YSR Cheyutha

-సాధికారత దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం

– బాబును నమ్మితే పులిని ఇంటికి తెచ్చుకున్నట్లే..!

– చేయూత నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం

ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి :తమది మహిళా పక్షపాత ప్రభుత్వం కనుకనే మహిళా సాధికారత దిశగా ప్రతి అడుగూ వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నాడు మహిళలకు ఒక సెంటు స్థలం ఇవ్వలేదని, ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో సొంత ఇళ్లులేని పేద మహిళలకు రాష్ట్రంలో 31 లక్షల ఇంటి స్థలాలు, 22 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. అనకాపల్లి జిల్లా పిసినికాడలో వైఎస్‌ఆర్‌ చేయూత నాలుగో విడత నిధులను బటన్‌ నొక్కి సిఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్‌ పోస్టులు, పనుల్లో మహిళలకు 50 శాతం కేటాయించేలా తమ ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకొచ్చిందన్నారు. మహిళలకు క్రమం తప్పకుండా ప్రభుత్వం సాయం చేస్తూ మల్టీనేషనల్‌ కంపెనీల తోడ్పాటు అందిస్తోందన్నారు. బ్యాంకు రుణాలు ఇప్పించడంతో కిరాణా వ్యాపారాలు, వ్యవసాయోత్పత్తులు, ఆహరోత్పత్తులు, వస్త్ర వ్యాపారాలు చేసుకుంటూ వారికాళ్లపై వారు నిలబడుతూ ఇంటిని నడుపుతున్నారని చెప్పడానికి గర్వపడుతున్నానని అన్నారు. 99.83 శాతం రుణ రికవరీతో పొదుపు సంఘాలు దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాయని చెప్పారు.

ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బిసిలు గుర్తుకొస్తారని, 2014లో బాబు, పవన్‌ కలిసి బిసిలకు ఇచ్చిన 143 హామీల్లో చేసింది సున్నా అని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఎన్ని అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా, ఎవరు మాటపై నిలబడతారు ? ఎవరు మోసం చేస్తారు? అనేది గుర్తించి ప్రజలు ఆశీర్వదించాలన్నారు. ‘చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను నమ్మితే కాటేసిన పామును, తినేసే పులిని ఇంటికి తెచ్చుకున్నట్లే’. చంద్రబాబు పేరు చెబితే దగా, వంచనలు గుర్తుకొస్తాయి. 2014లో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. నమ్మిన అక్క, చెల్లెమ్మలను నట్టేట ముంచారు’ అని విమర్శించారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు కొనిస్తామని చెప్పి బాబు, పవన్‌ మళ్లీ మోసగిస్తారని విమర్శించారు. గత ప్రభుత్వం ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు ఏర్పాటు చేయలేదు సరికదా.. విజయవాడలో కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్టు నడిపి అక్కాచెల్లెమ్మల జీవితాలను ఛిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. సభలో మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, బూడి ముత్యాలనాయుడు, రాజన్నదొర, బత్స సత్యనారాయణ, కలెక్టర్‌ రవి పట్టాన్‌ శెట్టి, అనకాపల్లి, అరకు ఎంపీలు డాక్టర్‌ సత్యవతి, మాధవి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, ఆదీప్‌రాజు, యువి.రమణమూర్తిరాజు, ఉమాశంకర్‌ గణేష్‌, ధర్మశ్రీ, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం నాయకుల గృహ నిర్బంధం

సిఎం పర్యటన నేపథ్యంలో సిపిఎం నాయకులపై ప్రభుత్వం మరోసారి నిర్బంధం ప్రయోగించింది. పలువురిని గృహ నిర్బంధించింది. జిల్లాలోని వివిధ తరగతుల ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లకుండా అడ్డుకుంది. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, డి.వెంకన్న, జిల్లా కమిటీ సభ్యులు కె.గోవిందరావు, కశింకోట మండల నాయకులు డి.శ్రీనివాసరావు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.శివాజీని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వ, పోలీసు తీరును సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ఖండించారు.

➡️