విశాఖ ఉక్కుపై సిఎంది మోసపూరిత వైఖరి

Apr 23,2024 21:17 #cpm, #prakatana

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :విశాఖ ఉక్కుపై సిఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మోసపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారని సిపిఎం విమర్శించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో సిఎం తీరును తీవ్రంగా ఖండించారు. విశాఖపట్నంలో జరిపిన ఎన్నికల పర్యటనలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మాట్లాడకుండా మౌనం వహించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అనంతరం పోరాడుతున్న కార్మికులకు అండగా ఉంటానని లోపాయికారిగా చెప్పడం మోసకారి తనం తప్ప మరొకటి కాదని తెలిపారు. పోరాట కమిటీ నాయకులు కలిసి మాట్లాడేందుకు సంవత్సరం క్రితం ఇంటర్య్వూ అడిగితే ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికల కోసం వారిని పిలిచి మాట్లాడటంలో నిజాయితీ లేదని పేర్కొన్నారు.
కనీసం వారిని కలిసిన సందర్భంలోనైనా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు తాను నిలబడతానని మాటమాత్రంగానైనా చెప్పలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న గనులను కేటాయించేందుకు కూడా హామీ ఇవ్వలేదని తెలిపారు. ఈ మూడేళ్లలో ఫ్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా ఒక్కసారి కూడా విశాఖ ఉక్కు పైవేటీకరణ ఆపమని ప్రధానిని అడిగిన పాపాన పోలేదని వివరించారు. ప్రధాని విశాఖ పర్యటన సందర్భంలో కూడా ఆయనకు కనీసం అర్జీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు ఓట్ల కోసం కార్మికులను మోసం చేసేందుకు ప్రకటన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపికి భయపడి విశాఖ ఉక్కును ఫణంగా పెట్డడం దారుణమని తెలిపారు. ఈ విషయంలో వైసిపి, టిడిపి, జనసేన ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని, మూడు పార్టీలు ఒకవైపు ప్రైవేటీకరిస్తున్న బిజెపికి మద్దతునిస్తూ మరోవైపు పోరాడుతున్న కార్మికుల పక్షం తామున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా వీరి అసలు రంగును గుర్తించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్న వామపక్షాలను ఆదరించాలని కోరారు.

➡️