టోఫెల్‌పై స్పష్టత అవసరం

Jun 30,2024 05:15 #editpage

గత ఏడాది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నుండి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో టోఫెల్‌ను ప్రవేశ పెట్టింది. గత ఏడాది కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఈ కోర్స్‌ అమలయింది. ఈ విద్యా సంవత్సరం నుండి టోఫెల్‌ ఒక సబ్జెక్టుగా ఉంటుందని అప్పటి విద్యా శాఖాధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో టోఫెల్‌పై ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇంగ్లీష్‌ పాఠ్య పుస్తకంతో పాటు, వర్క్‌బుక్‌ కూడా విద్యార్థులకు ఉంది. తొమ్మిది, పదవ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకం, వర్క్‌బుక్‌తో పాటు, ఉప వాచకం కూడా వుంది. ఇటువంటి పరిస్థితులలో ఇంగ్లీష్‌ సిలబస్‌ విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయ సిబ్బందికి కూడా భారంగా మారిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. టోఫెల్‌ ఉద్దేశం మంచిది అయినప్పటికీ, సిలబస్‌ పూర్తి చేయడానికి పాఠశాల పని దినాలు సరిపోవని ఉపాధ్యాయ సిబ్బంది అంటున్నారు. దీనిపై పున:సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.
– యం. రాంప్రదీప్‌,
తిరువూరు.

➡️