వ్యవస్థలు కుమ్మక్కయితే ప్రజాస్వామ్యానికి ముప్పు

Dec 14,2023 10:35 #Citizens for Democracy
  •  సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసి రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : కార్యనిర్వహక వ్యవస్థ, శాసన వ్యవస్థతో కుమ్మక్కవడం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడవేస్తాయని, రాజ్యాంగం నిర్ధేశించిన మార్గంలో కార్యనిర్వహక, శాసన, న్యాయవ్యవస్థలు వేటికవే స్వతంత్రంగా పనిచేస్తేనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలమని వ్యక్తలు పేర్కొన్నారు. బుధవారం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసి సహాయ కార్యదర్శి వి లక్ష్మణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాజీ డిజిపి ఎంవి భాస్కర్‌రావు మాట్లాడారు. ఇటీవల కాలంలో రాజకీయనాయకులు వ్యవస్థలను తమ గుప్పెట్లోకి తీసుకోవడం ఎక్కువ అయ్యిందన్నారు. అధికార పార్టీ నాయకులకు తమ రాజకీయ ఆధిపత్యాన్ని సాదించుకునేందుకు పోలీసు వ్యవస్థను సాధనంగా మలచుకోవడం ప్రమాదకరమని అన్నారు. వేతనం తీసుకొని కార్యనిర్వహణ వ్యవస్థలో పనిచేసేవారు తమ విధులను ఖచ్చితత్వంతో పాటించాల్సిన అవసరం వుందన్నారు. బ్రిటీష్‌ కాలంలో స్వాతంత్య్రపోరాటంలో ఎక్కువ మంది న్యాయవాదులే ముందుండి నడిపించారని అదే స్పూర్తితో ఇపుడు కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు న్యాయవాదులు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్బంగా సిఎఫ్‌డి కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేస్తే కొందరిలో అసహనం కనిపిస్తోందన్నారు. నిరసన తెలియజేయకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

రాష్ట్రంలో నిరవధికంగా సెక్షన్‌ 30, 144 సెక్షన్‌లు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పోలీసు కేసులపై సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ స్వతంత్రంగా పనిచేసేలా మాజీ డిజిపి ఎంవి భాస్కరరావు, మాజీ ఎఎజి ఎ సత్యప్రసాద్‌, హిందూ పూర్వ రెసిడెంట్‌ ఎడిటర్‌ కె వెంకటేశ్వర్లుతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సందర్బంగా హైకోర్టు సీనియర్‌ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ ఒంటెత్తు పోకడలతో పోతోందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడానని తనకు 160 నోటీస్‌ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పై వాడికి బానిస, కిందవాడికి పెత్తందారుగా పనిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పౌరహక్కుల ఉల్లంఘనలపై ప్రజలు మానవహక్కుల కమిషన్‌కు, రాష్ట్ర హైకోర్టు జడ్జీకి ఫిర్యాదులు చేయాలని, ఇలా చేయడం ద్వారా వారిపై ఒత్తిడికూడా పెరుగుతుందన్నారు. ఈ సందర్బంగా ఐలు రాష్ట్ర నాయకులు, హై కోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో యధేచ్చగా మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు.

టీచర్లు, సామాన్యులు, చివరకు మాజీ మంత్రులు నిరసనలకు వస్తున్నారంటే హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారని అన్నారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్‌లు చేయడం చట్టవిరుద్దమని అన్నారు. ప్రభుత్వమే రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య నాయకులు అక్కినేని వనజ మాట్లాడుతూ ఇటీవల పోలీసులు ఎక్కడా నిబంధనలను పాటించడం లేదని అన్నారు. ఢిల్లీలో ప్రబీర్‌ పురకాయస్థ, రాష్ట్రంలో మాజీ సిఎం చంద్రబాబు నాయుడి అరెస్ట్‌ వ్యవహారంలో పోలీసులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని అన్నారు. ఈ సందర్బంగా పిసిసి వర్కింగ్‌ ప్రసిడెంట్‌ ఎన్‌ తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చట్టబద్దపాలన ఎక్కడా లేదని విమర్శించారు. పులివెందులలో సిఎం ప్రత్యర్థి అని బిటెక్‌ రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పజెప్పడం ప్రమాదకరమని అన్నారు. ఈ హిందూ మాజీ రెసిడెంట్‌ ఎడిటర్‌ వెంకటేశ్వర్లు, మాజి ఎఎజి సత్యప్రసాద్‌, భవాని ప్రసాద్‌ తదితరులు పాల్గన్నారు.

➡️