కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య

Mar 31,2024 22:26 #Congress, #joined, #Kadyam Srihari, #Kavya

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :పార్లమెంట్‌ ఎన్నికల ముందు బిఆర్‌ఎస్‌ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌లో చేరారు. సిఎం సమక్షంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ కాంగ్రెస్‌ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కడియం కుమార్తెకు లోక్‌సభ టికెట్‌ ఇచ్చినా బిఆర్‌ఎస్‌ను వీడడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజులుగా వస్తున్న అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్‌ ట్యాపింగ్‌, లిక్కర్‌ స్కాం తదితర అంశాలు బిఆర్‌ఎస్‌ ప్రతిష్ఠను దిగజార్చాయని పేర్కొంటూ లోక్‌సభ అభ్యర్థిత్వం నుంచి కావ్య తప్పుకున్నారు. వరంగల్‌ జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండడంతో బిఆర్‌ఎస్‌కి మరింత నష్టం చేసిందని, ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని ఆమె కెసిఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అనంతరం కడియం శ్రీహరి, కావ్యను కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఆ పార్టీలోకి ఆహ్వానించడం, వెంటనే చేరిపోవడం జరిగిపోయాయి. వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కావ్య లేదా కడియం శ్రీహరిని నిలిపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలా జరగనిపక్షంలో ఆయనకి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.

➡️