దంపతుల ఆత్మహత్యాయత్నం

Mar 26,2024 22:40 #gunter, #suside

– భర్త మృతి, చికిత్స పొందుతున్న భార్య
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా):గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. అప్పులు, ఆస్తి వివాదాల నేపథ్యంలో దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో భర్త మృతి చెందగా, భార్య చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన పి.చంద్రశేఖర్‌ (45), నాగలక్ష్మి దంపతులు వ్యవసాయ కార్మికులు. వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబంలో ఆస్తి వివాదాలు ఉన్నాయి. కొంతకాలంగా అప్పుల వారి ఒత్తిడి పెరగడంతో నాగలక్ష్మి పుట్టిల్లైన కొల్లిపర మండలం తూములూరుకు వచ్చారు. నాగలక్ష్మి తల్లితో వారు ఎదుర్కొంటున్న ఆర్ధికపరమైన అంశాలు చర్చించి, కుటుంబానికున్న భూమిని విక్రయించాల్సిందిగా ప్రతిపాధించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పులు తీర్చే మార్గం లేకపోవడం, ఆస్తి వివాదం తలెత్తడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో సోమవారం రాత్రి పురుగుమందు తాగారు. కుటుంబ సభ్యులు వారిని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రశేఖర్‌ మృతి చెందారు. నాగలక్ష్మి చికిత్స పొందుతున్నారు. కొల్లిపర ఎస్‌ఐ రవీంద్రారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️