తమ్మినేనికి తీవ్ర అస్వస్థత

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించి ఖమ్మంలోని ఆరోగ్య హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్న ఆయన్ను వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్స కోసం మంగళవారం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఎఐజి ఆస్పత్రి తమ్మినేని ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఈ బులెటిన్‌లో తమ్మినేని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపింది ‘సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను ఖమ్మం నుంచి వెంటిలేటర్‌ సాయంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆయన గుండె సరిగా పని చేయడం లేదు. హృదయ స్పందన అసాధారణంగా ఉంది. మూత్రపిండాల పనితీరు కూడా సరిగా లేదు. ఈ కారణాల వల్ల ఆయన ఊపిరితిత్తులలో నీరు చేరింది. ఆయన రక్తపోటును సాధారణ స్థితికి తెచ్చేందుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల నుంచి నీటిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసాధారణంగా ఉన్న హృదయ స్పందనను సరిచేసేందుకు చికిత్స జరుగుతోంది. డాక్టర్‌ సోమరాజు, డాక్టర్‌ డీఎన్‌ కుమార్‌ల పర్యవేక్షణలో క్రిటికల్‌ కేర్‌ విభాగాలకు చెందిన నిపుణులు, కార్డియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, పల్మనాలజిస్టులతో కూడిన వైద్య బృందం చికిత్స అందిస్తోంది.’ అని ఎఐజి ఆస్పత్రి పేర్కొంది.సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులతో పాటు పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆస్పత్రికి చేరుకొని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు కూడా ఆస్పతిలో తమ్మినేనిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని, అధైర్యపడొద్దని పార్టీ నేతలు ఒక ప్రకటనలో కోరారు.

➡️