ఎమ్మెల్సీ సాబ్జి మృతికి సిపిఎం సంతాపం

cpm condolence to sabji death

ప్రజాశక్తి-విజయవాడ : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఉద్యమ ప్రముఖ రాష్ట్ర నాయకులు షేక్‌ సాబ్జి దుర్మరణం పట్ల సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సాబ్జి మరణం ఉపాధ్యాయ, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని నష్టమని పేర్కొంది. ఆకివీడులో అంగన్వాడీ సమ్మెకు మద్దతు తెలిపి తిరిగి భీమవరంలో అదే కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని తెలిపింది.
పిడిఎఫ్‌ తరఫున శాసనమండలిలో ఉపాధ్యాయ, ఉద్యోగుల వాణిని వినిపించడంలో దిట్ట అని తెలిపింది. అన్ని తరగతుల, వర్గాల ప్రజల తరఫున శాసనమండలిలోను, బయట పోరాడుతున్న యోధుడని పేర్కొంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తదనంతరం మన రాష్ట్రంలో యుటిఎఫ్‌ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారని వెల్లడించింది. రాష్ట్ర అధ్యక్షులుగా చాలా కాలం పని చేశారని, అలాంటి నాయకుడిని కారు ప్రమాదంలో కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొంది. ఈ లోటు పూడ్చ లేనిదని, వారి శ్రీమతి షేక్‌ సుబాని, కుమార్తె అష్రప్‌ బేగం, కుమారుడు అబుల్‌ కలాం ఆజాద్‌ ఇతర కుటుంబ సభ్యులకు సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

➡️