గడపగడపకు సిపిఎం ప్రచారం

  • వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి

ప్రజాశక్తి-యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల్లో సిపిఎం, ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ అభ్యర్థులు సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. పలుచోట్ల రోడ్‌ షోలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రజా సమస్యలపై నింతరం పోరాడే వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మోడీ కూటమికి, నిరంకుశ వైసిపికి మరోసారి అధికారమిస్తే దేశం, రాష్ట్రం రెండూ నాశనమైపోతాయని హెచ్చరించారు.
విజయనగరం జిల్లా మెంటాడలో అరకు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి పాల్గొన్నారు. తొలుత మెంటాడ సినిమా హాలు వద్ద నుంచి డప్పుల వాయిద్యాలతో గ్రామ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో పుణ్యవతి మాట్లాడుతూ.. గిరిజనులను మోసం చేస్తున్న నరేంద్ర మోడీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. గిరిజనులకు తాగునీరు, రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మోడీ తన అనుయాయులైన అంబానీ, అదానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెడుతున్నారని విమర్శించారు. అటవీ హక్కుల చట్టం తెచ్చి 15 ఏళ్లు కావస్తున్నా గిరిజన నిరుపేదలకు సెంటు భూమి ఇవ్వలేని పరిస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఆగ్రహించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పూటకో పార్టీ మారుతున్న బిజెపి అభ్యర్థి కొత్తపల్లి గీత రూ.400 కోట్లు అక్రమంగా దోచుకున్నారని విమర్శిం చారు. ఇప్పటికీ ఆ కేసు కోర్టులో ఉందని, ఇటువంటి వ్యక్తులను గెలిపిస్తే దేశ భవిష్యత్తు దెబ్బతింటుం దని హెచ్చరించారు. అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్స పేదలపక్షాన పోరాడుతున్నారని, ఆయనను గెలిపించాలని కోరారు.
విజయవాడ 29వ డివిజన్‌ బావాజిపేట, దుర్గాపురం, గులాబితోట, హనుమాన్‌పేట, గాంధీ నగర్‌ తదితర ప్రాంతాల్లో సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్ధి చిగురుపాటి బాబూరావు రోడ్‌ షో నిర్వహించారు. సాయంత్రం 59వ డివిజన్‌ సింగ్‌నగర్‌లో జరిగిన ప్రచారంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రజలను కలుసుకొని ఓట్లు అభ్యర్ధించారు. స్థానిక ప్రజలు హారతులు, దండలతో వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ప్రజా మద్దతుతో ఎర్రజెండా ఎగురవేస్తామన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ప్రజల మద్దతుతో సిపిఎం గెలవబోతుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపికి, దానికి మద్దతిస్తున్న టిడిపి, వైసిపిలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. సిపిఎం అభ్యర్థులను చట్ట సభలకు పంపాలని కోరారు.


నెల్లూరు నగరంలోని కపాడిపాళెం ప్రాంతంలో ఆ నియోజకవర్గ అభ్యర్థి మూలం రమేష్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. కపాడిపాళెం ప్రాంతంలో డ్రెయినేజీ, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించలేని స్థితిలో పాలకులు ఉన్నారన్నారు. నెల్లూరు నగరాభివృద్ధికి తనను గెలిపించాలని కోరారు. ప్రచారంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మన్నూరు భాస్కరయ్య పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం వడ్లపూడిలో నియోజకవర్గ అభ్యర్థి జొన్నా శివశంకరరావు రోడ్‌ షో ద్వారా ప్రచారం చేశారు. వాహనం పై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనేక ప్రజా సమస్యలపై పోరాడుతున్న తాము చట్టసభల్లోనూ ప్రజావాణి వినిపించేందుకు వీలుగా తనకు ఓటు వేయాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం బొజ్జరాయి గూడెం, టేకులొద్ది, అభిచర్ల, గొమ్ము అయ్యవారిగూడెం, కొండాయిగూడెం, విఆర్‌.పురం మండలం కుంజవారిగూడెం, మోసంగుంపు, మడివి గుంపు, పిసం గుంపు, సరియం గుంపు, పొడియం గుంపు, మధ్య గుంపు తదితర గ్రామాల్లో సిపిఎం నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రంపచోడవరం అభ్యర్థి లోతా రామారావు, అరకు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సను గెలిపించాలని కోరారు.
విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని తోకాడ, గాజువాక ఆటోనగర్‌, స్వతంత్రనగర్‌, కుంచుమాంబ కాలనీల్లో ఆ నియోజకవర్గ అభ్యర్థి ఎం.జగ్గునాయుడు ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. తోకాడలో ఉన్న 22 ‘ఎ’ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటుపరం కాకుండా ఉంటేనే గాజువాక ఆటోనగర్‌కు వర్క్‌ ఆర్డర్లు రావడానికి అవకాశాలు ఉంటాయని తెలిపారు.
నంద్యాల జిల్లా గడివేముల మండలంలో సిపిఎం పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి గౌస్‌ దేశారు, కాంగ్రెసశ్రీ నంద్యాల ఎంపి అభ్యర్థి జంగిటి లక్ష్మీ నరసింహయాదవ్‌ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి రైతులను రోడ్డున పడేసిందన్నారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి కూడా మోడీకి అనుకూలంగా వ్యవహరించి రైతులు, పేదలు, కార్మికులను మోసం చేసిందన్నారు.

➡️