బిజెపిని ఓడించడమే లక్ష్యం : సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : బిజెపిని ఓడించడమే లక్ష్యం అని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఇండియా బ్లాక్‌ బలపరిచిన సిపిఐ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి జంగాల అజయ్ కుమార్‌, కాంగ్రెస్‌, సిపిఎం అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ … శుక్రవారం ఉదయం గుంటూరులోని బిఆర్‌ స్టేడియం నుండి ర్యాలీ సాగింది. అనంతరం కొత్తపేటలోని సి.పి.ఐ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో సీతారాం ఏచూరి మాట్లాడుతూ …. దేశభక్తి అంటే బిజెపి ని ఓడించడమేనని.. దానినే లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన బిజెపితో టిడిపి, జనసేనలు కలిసి ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. పార్లమెంట్లో 150 మంది ఎంపి లని సస్పెండ్‌ చేసి ప్రజావ్యతిరేక చట్టాలను మోడీ ఆమోదించుకున్నారని అలాంటి వ్యక్తికి టిడిపి, వైసిపి మద్దతు ఇచ్చాయన్నారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి ఆర్‌.ఎస్‌.ఎస్‌. బిజెపి ఫాసిస్టు రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. దేశంలో 100 కోట్ల మంది వద్ద ఉన్న ఆస్తి కేవలం 22 మంది మోడీ మిత్రులవద్ద ఉండిపోయిందన్నారు. విభజన చట్టం అమలు చేయకుండా రాష్ట్రానికి మోడీ తీరని అన్యాయం చేసినా టిడిపి, వైసిపి, జనసేన బిజెపి కి అంటకాగుతున్నాయని ఆరోపించారు. మొదట రెండు విడతలలో జరిగిన ఎన్నికలలో బిజెపి ఓడిపోతుందని సంకేతాలు రావడంతో మోడి మతతత్వాన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సి.పి.ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ …. బిజెపి ని, ఆ పార్టీ కి మద్దతు ఇస్తున్న పార్టీలని ఒడించాలని ప్రజలకి పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన చట్టం లో పొందుపరిచిన హామీలను బిజెపి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని చెప్పారు. మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సభకు డిసిసి అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకఅష్ణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌, పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, తదితరులు పాల్గొన్నారు.

➡️