ఖండిస్తున్నాం : ఎస్మా ప్రయోగంపై సిపిఎం

cpm on anganwadi workers strike 26th day protest

ప్రజాశక్తి-విజయవాడ : అంగన్‌వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.వో.నెం-2 జారీ చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండించింది. తక్షణమే జివో ను ఉపసంహరించి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. 26 రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న అంగన్‌వాడీలను ఎస్మా చట్టపరిధిలోకి తీసుకువచ్చి సమ్మెను నిషేదించడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకుండా సమ్మె నిషేదిస్తూ, సమ్మె కాలానికి జీతాల్లో కోత విధించడం దుర్మార్గమన్నారు. న్యాయబద్ధమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలనుకోవడం అభ్యంతరకరమైనదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మోడీ కేంద్ర ప్రభుత్వ అడుగుజాడల్లో ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నదని ఆగ్రహించారు. ఇదే వైఖరి కొనసాగితే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ నిరంకుశ చర్యను కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు, ప్రజాతంత్ర వాదులు ఖండించవలసిందిగా సిపిఐ(యం) విజ్ఞప్తి చేసింది. సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలకు అండగా నిలబడవలసిందిగా ప్రజలకు సిపిఐ(యం) విజ్ఞప్తి చేసింది.

➡️