భూ హక్కుల చట్టంలో ఎన్‌డిఎ, వైసిపి రెండూ నేరస్తులే

May 6,2024 08:04 #cpm v srinivasarao, #press meet
  • ఈ చట్టంతో గిరిజనులు, పేదరైతులు, గుడిసెవాసులకు తీవ్ర నష్టం
  •  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
  •  రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి
  •  విశాఖ ఉక్కుపై ప్రధాని ప్రకటన చేయాలి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : భూ హక్కుల చట్టం విషయంలో ఎన్‌డిఎ, వైసిపి రెండూ నేరస్తులేనని, చట్టాన్ని అమలు చేయాలని బిజెపి హుకుం జారీ చేస్తే, వైసిపి ఆగమేఘాల మీద ఆమోదించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఉదయం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలో చట్టం తీసుకొచ్చిన బిజెపితో కలిసి ఎన్నికల్లోకి వెళుతున్న చంద్రబాబు దీన్ని ఎలా రద్దు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజలను మోసగించేందుకే ఇలా చెబుతున్నారన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు భూములు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం నీతి ఆయోగ్‌ ద్వారా అన్ని రాష్ట్రాలకూ హుకుం జారీచేసిందని తెలిపారు. కార్పొరేట్లకు సులభంగా భూముల బదలాయింపు కోసమే ఈ చట్టం తెస్తున్నామని నీతి ఆయోగ్‌ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీన్ని రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రతి యజమాని భూమి తనదే అని ప్రాథమిక కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని, రెండేళ్ల తరువాత శాశ్వత పట్టా ఇస్తారని పేర్కొన్నారు. ఈలోగా వివాదం వస్తే చిన్న యజమానులు భూములు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల రైతుల భూములకు భద్రతలేని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు వేల ఎకరాలు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన ఈ చట్టం అమలు చేస్తే రైతుల భూములన్నీ కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోతాయని అన్నారు. దీనికోసం ఇప్పటికే ఆన్‌లైన్‌ మ్యుటేషన్‌ తీసుకొచ్చారని, ఇది కూడా అమలైతే ఎవరి భూములు ఎప్పుడు ఎవరి చేతుల్లోకి వెళతాయో తెలియని దుస్థితి నెలకొంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సుందరీకరణ పేరుతోనూ ప్రభుత్వ, పోరంబోకు భూముల్లో ఇళ్లేసుకున్న పేదల భూములను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగిస్తారని పేర్కొన్నారు. చట్టం అమల్లోకి వస్తే ఎవరు అధికారంలో ఉంటే వారు రైతులను బెదిరించి భూములు లాక్కుంటారని, దీనిపై అప్పీలుకు సామాన్య రైతులు కూడా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతర భూస్వాములు తప్పుడు రికార్డులు సృష్టించి అనుభవిస్తున్నారని, ఆ భూములకు ఇప్పుడు చట్టబద్ధత వస్తుందని హెచ్చరించారు. భూములను ఇష్టం వచ్చినట్లు లాక్కునేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఇప్పటికే గిరిజనులు భూముల కోసం న్యాయ పోరాటాలు చేస్తున్నారని, భూ హక్కుల చట్టం వల్ల ఎక్కువగా నష్టపోయేది గిరిజనులేనని, తీవ్ర అన్యాయానికి గురవుతారన్నారు. సమస్యలు ఉన్నాయని చెబుతున్నారని, మొత్తం భూమిలో 20 శాతానికి మాత్రమే సమస్యలు ఉంటాయని, 80 శాతానికి ఉండవని తెలిపారు. అటువంటప్పుడు 20 శాతం భూ సమస్యలను పరిష్కరిస్తే సరిపోతుందని, అలా కాకుండా కొత్త వివాదాలు సృష్టించే విధంగా ఈ చట్టం ఉందని అన్నారు. ఇటువంటి అన్యాయమైన చట్టాల అమలుకు బిజెపి దుష్ట ప్రయత్నం చేస్తే వైసిపి అంగీకరించిందని తెలిపారు. బిజెపి దీనిపై వివరణ ఇవ్వాలని సజ్జల అడగడం సిగ్గుచేటని అన్నారు. చట్టం చేయకముందే బిజెపిని నిలేయకుండా ఇప్పుడు మాట్లాడటంలో నిజాయితీ లేదన్నారు. దీనిపై రాష్ట్రంలో పార్టీలు కొట్లాడుకుంటున్నాయని, బిజెపి మాత్రం తేలుకుట్టిన దొంగలా ఉందని అన్నారు. నిజాయితీ ఉంటే ఈ చట్టాన్ని రద్దుచేస్తారా లేదా అని బిజెపిని ఎన్‌డిఎలో ఉన్న చంద్రబాబు నిలదీయాలని కోరారు.

మోడీ అబద్ధాలు, అస్పష్ట ప్రకటనలు
మోడీ వస్తున్న సందర్భంలో రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ప్రజలకు ఆయన సంజాయిషీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకూ రాష్ట్రాభివృద్ధి గురించి ఆయన మాట్లాడటం లేదని, అబద్ధాలు, అస్పష్ట ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. కీలకమైన విశాఖ ఉక్కుపై అనకాపల్లి సభలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే శంకుస్థాపన చేసిన అమరావతి అభివృద్ధిని అడ్డుకున్నారని, దానికీ సమాధానం చెప్పాలని కోరారు. పోలవరానికి 15 వేల కోట్లు ఇచ్చానని చెబుతున్నారని, అవన్నీ కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లాయని, అక్కడ నష్టపోయిన నిర్వాసిత గిరిజనులకు ఏమీ ఇవ్వలేదని అన్నారు. పునరావాసం కోసం రూ.33 వేల కోట్లు అవసరం అయితే రూ.400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, అడవి బిడ్డలను గోదారిలో ముంచారని, దీనిపై రాష్ట్ర ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విశాఖ రైల్వేజోన్‌పై నిర్ణయం తీసుకోవాలని చెప్పడం మోసమని, అది విభజన చట్టంలోనే ఉందని అన్నారు. పారిశ్రామిక కారిడార్‌కు కసరత్తు చేస్తున్నామని చెబుతున్నారని, మరి పదేళ్లుగా అధికారంలో ఉండి ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు పాతిక కోట్లు చొప్పున ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటేనన్నారు. నాలుగేళ్లు నిధులు ఇచ్చి ఐదో ఏడాది ఇచ్చిన నిధులను కూడా వెనక్కు తీసుకున్నారని తెలిపారు. ఇన్ని విధాలా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో కలిసి చంద్రబాబు ఎలా న్యాయం చేస్తాడో చెప్పాలని కోరారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి ఎవరు గెలిచినా పెత్తనం ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిపోతుందని అమిత్‌షా పాలన చేస్తారని పేర్కొన్నారు.

ఇండియా వేదిక పార్టీలను గెలిపించాలి
ఒకవైపు ఎన్‌డిఎ, వైసిపి రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తుంటే ఇండియా వేదికలోని కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ప్రత్యేక హోదా ఇస్తామని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపేస్తామని హామీ ఇస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇండియా వేదికలోని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులను రాష్ట్ర ప్రజలు గెలిపించాలని శ్రీనివాసరావు కోరారు.

➡️