డోలాయమానంలో అన్నదాతలు 

Dec 21,2023 08:25 #Crop Damage, #Farmers Problems
crop damage in cyclone

మిల్లర్ల వ్యవహార శైలితో నష్టపోతున్న రైతులు

రంగు మారిన ధాన్యం కొనుగోలుపై కొరవడిన స్పష్టత

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మిచౌంగ్‌ తుఫాన్‌తో తడిసిన రంగుమారిన ధాన్యం మొత్తాన్ని కొంటున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. మిల్లర్లు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఎంఎస్‌పి ధరల్లో కోత పెడుతున్నట్లు సమాచారం. పభుత్వం ప్రకటించిన మద్ధతు ధర కంటే 75 కిలోల బస్తాకు రూ.200లు నుంచి రూ.300ల వరకు తక్కువకు కొనుగోలు చేస్తున్నారని సమాచారం. . పంటల నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యం శాంపిల్స్‌ను పరీక్షల కోసం తీసుకెళ్లారని,. వీటి విషయంలో ఓ నిర్ణయం వెలువరిస్తామని చెప్పినప్పటికీ కేంద్ర బృందాలు స్పష్టంగా మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో మిల్లర్లు ఆడిందే ఆటగా పాడిందే పాటగా ధాన్యం సేకరణ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే అనేకమంది మిల్లర్లు బ్యాంక్‌లకు చెల్లించాల్సిన షూరిటీ డిపాజిట్‌లు సరుకు కొనుగోలుకు సరిపడా చెల్లించకపోవడంతో ఆయా మిల్లుల వద్ద రెండు మూడు రోజులు కూడా రైతులు తీసుకెళ్లిన ధాన్యం అన్‌లోడ్‌ కాని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇదే విషయంపై పలు ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపిన సంగతి పాఠకులకు విధితమే. సరుకు అన్‌లోడ్‌ అయ్యే లోగా వర్షం పడినా, సమయం ఆలస్యమయ్యే కొద్ది వాహనం అద్దె తలకు మించిన భారంగా మారుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • నేటి వరకు 12.5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌ సీజన్‌లో నేటి వరకు రూ. 2,760 కోట్ల విలువైన 12.5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. జిల్లాల వారీగా ధాన్యం సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. 26 జిల్లాల్లో 680 మండలాలు, 4,167 రైతు భరోసా కేంద్రాలు ఉండగా అందులో 244మండలాల్లోని 2716 ఆర్‌భికెల్లో ధాన్యం సేకరణను ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం 1,88,423మంది రైతుల వద్ద నుంచి రూ.2749.92కోట్లు విలువ జేసే 12.5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది.

 

  • నేటికీ ధాన్యం సేకరణ ప్రారంభించని జిల్లాలు

ప్రకాశం, కర్నూలు, అనంతపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్‌ఆర్‌, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాల్లో ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. ఆయా జిల్లాల్లో వరి పంట ఈనెలాఖరు నాటికి కానీ కోతలకు రాదని, కోతలు చేపట్టిన వెంటనే సేకరణ ప్రారంభిస్తామని ఫ్రభుత్వం పేర్కొంటోంది.

  • రైతుకు నష్టం లేకుండా కొనుగోలు : పౌరసరఫరాలశాఖ ఎమ్‌డి వీరపాండియన్‌

రైతుకు ఎటువంటి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటి వరకు 12.5లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించగా, మిచౌంగ్‌ తుఫాన్‌ నేపథ్యంలో ఒక్క నెలలోనే 9 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని పౌరసరఫరాలశాఖ ఎమ్‌డి వీరపాండియన్‌ తెలిపారు. మిల్లర్లు బ్యాంక్‌ షూరిటీలు సరిపడినన్ని చెల్లించని వారిని తక్షణమే చెల్లించాలని ఆదేశాలిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులకు రూ.2749 కోట్ల చెల్లింపులకు గానూ రూ.343కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు. మిల్లర్ల వద్ద స్టాక్‌ ఎక్కువై నిల్వ చేసుకునే అవకాశం లేని ప్రాంతాల్లోని ధాన్యాన్ని సమీపంలోని సేకరణ ప్రారంభం కాని ప్రాంతాల్లోని మిల్లులకు తరలిస్తున్నట్లు ఎమ్‌డి వీరపాండియన్‌ పేర్కొన్నారు.

➡️