జగన్‌ను గద్దెదించేందుకు దళితులు సిద్ధం

Jan 12,2024 08:16 #harsha kumar, #press meet

– షర్మిలకు ఎపి కాంగ్రెస్‌ పగ్గాలు ఇవ్వొద్దు

– అమలాపురం నుంచి ఎంపిగా పోటీ : హర్షకుమార్‌

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి:ఎన్నో ఆశలు పెట్టుకున్న దళిత జాతి గత ఎన్నికల్లో జగన్‌కు బాసటగా నిలిచిందని, కాని వారి ఆశలపై సిఎం జగన్‌ నీళ్లు చల్లారని, అందుకే నేడు ఆయన్ని గద్దె దించేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారని అమలాపురం మాజీ ఎంపి హర్షకుమార్‌ అన్నారు. రాజమహేంద్రవరంలోని రాజీవ్‌గాంధీ కళాశాల సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పేందుకు ఫిబ్రవరి 8న ‘దళిత సింహ గర్జన’ సభను బమ్మూరులో నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి 12న సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్నారు. దళితులను సిఎం జగన్‌ ఎలా దగా చేశారో ఈ గర్జనలో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. తెలంగాణకు చెందిన వైఎస్‌.షర్మిలకు ఎపి కాంగ్రెస్‌ పగ్గాలు ఇవ్వొద్దని, ఆ రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆమె ఇక్కడెలా పనిచేయగలరని, ఎపిలో కాంగ్రెస్‌ను నడిపించే నాయకులు లేరా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పుట్టానని చెప్పుకునే షర్మిలకు నాయకత్వం ఇస్తే బూడిదలో పోసిన పన్నీరవుతుందని వ్యాఖ్యానించారు. కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి జగన్‌ ఇంటికి షర్మిల వెళ్లారని, ఆ సమయంలో జగన్‌తో ఆమె అరగంటకుపైగా మంతనాలు జరిపారని, దీని వెనుక మర్మమేమిటో తెలియదని.. ఇవన్నీ కాంగ్రెస్‌ అధిష్టానం గమనించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, విశాఖ ఉక్కు పరిరక్షణ వంటివి కాంగ్రెస్‌తోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో తాను అమలాపురం నుంచి ఎంపిగా పోటీ చేస్తానని తెలిపారు.

➡️