డాక్టర్‌ కూటికుప్పలకు దాసరి ఫిలింస్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

May 2,2024 12:35

విశాఖపట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ కుటికుప్పల సూర్యారావుకు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. దాసరి ఫిలింస్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌ మెంట్‌ అవార్డును భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లో గురువారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానం చేశారు. గత రెండు దశాబ్దాలుగా జాతీయంగా, అంతర్జాతీయంగా డాక్టర్‌ కుటికుప్పల సూర్యారావు ఎయిడ్స్‌ రంగంలోనూ, ఇతర సామాజిక సేవారంగాల్లో అందిస్తున్న సేవలను ఉపరాష్ట్రపతి అభినందించారు. అవార్డు గ్రహీతల కమిటీ చైర్మన్‌ రాంసత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైస్‌ ప్రెసిడెంట్‌ వంశీ రామ్‌ రాజు, కె.ధర్మారావులకు అభినందనలు తెలిపారు. డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు చేస్తున్న సేవల గురించి తెలుసుకుందాం..దాసరి ఫిలింస్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు వచ్చిన సందర్భంగా వివరాలు ఆయన మాటల్లోనే…

ఎయిడ్స్‌ అంతం కోసం …

సమాజం నుంచి ఎయిడ్స్‌ వ్యాధిని కూకటివేళ్లతో పెకిలించటానికి తన సర్వ శక్తులను ఒడ్డుతున్న వారు ప్రపంచవ్యాప్తంగా కొందరు ఉన్నారు. మనదేశంలో ఈ వ్యాధి రాకముందే అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు వ్యాధి సోకిన రెండేళ్లకే పిట్టల్లా రాలిపోతుండేవారు. దీనికి విశాఖపట్టణానికి చెందిన అంతర్జాతీయ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు ఎంబిబిఎస్‌, ఎండి, పిహెచ్‌డి, ఎఫ్‌ఆర్‌సిపి, ఎఫ్‌ఎఎంఎస్‌, డిఎస్‌సి చలించిపోయారు. అక్కడి పిల్లలు, మహిళలు, వ్యాధిగ్రస్తుల పట్ల చూపిస్తున్న వివక్షపై తీవ్ర ఆందోళన చెందారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇలాగ ఉంటే అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో పరిస్థితులు ఎలాగుంటాయో ఆయన తన స్వీయ పరిశోధన ద్వారా అంచనా వేశారు. 1980వ దశకంనుంచి నేటి వరకూ ఎయిడ్స్‌ నివారణా పద్ధతులపై ఆయన అనేక ప్రయోగాలు చేశారు. సరికొత్త చికిత్సలు కొనసాగిస్తూ వ్యాధిగ్రస్తులు కూడా అందరిలాగే సమాజంలో జీవించొచ్చునని, ఎలాంటి వివక్ష పాటించరాదని ఢంకాబజాయించి మరీ చెబుతున్నారు. నేడు కేవలం ఒక్క ఇంజక్షన్‌ ద్వారా ఎయిడ్స్‌ తగ్గిపోయే మందులు వచ్చాయనీ, వ్యాధిగ్రస్తులు కూడా మామూలు వారి మాదిరిగా 80 ఏళ్లు వరకూ జీవించొచ్చునని చికిత్సల ద్వారా రుజువు చేస్తున్నారు. సొంతూరు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతలి గ్రామం. అయితేనేం…ప్రముఖ సాంక్రమిత వ్యాధుల నిపుణుడిగా ఆయన విశాఖపట్టణం నుంచి ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. 1980 దశకంలో ఎయిడ్స్‌ తాకిడికి అమెరికా లాంటి అగ్రదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో జయకేతనం ఎగురవేస్తున్న తరుణంలో కూడా ఎండుటాకులా విలవిల్లాడిపోయింది. 1981లో లాస్‌ ఏంజెల్స్‌లోనూ, న్యూయార్క్‌లోనూ పాతికేళ్లలోపు యువకులు ఆయాసం, విరోచనాలు, జ్వరంతో రెండేళ్లలోపే మరణించేవారు. ఇదే తంతు ఆఫ్రికాలోనూ కొనసాగింది. 1986లో మొట్టమొదటి పది హెచ్‌ఐవి కేసులు చెన్నైలో బయటపడే సరికే నేను ఈ మహమ్మారికి కారణాలు కనుగొనడంపై పరిశోధనలు చేస్తున్నాను. ఎయిడ్స్‌ వ్యాధిలాగే వ్యాపించే హెపటైటిస్‌ బి వ్యాధి రక్తం పాజిటివ్‌ వారితో లైంగిక సంపర్కం, కలుషిత సూదులు, పచ్చబట్లు వేసుకునే సమయంలోనూ, ఆపరేషన్ల పనిముట్లు సరిగా స్టెరిలైజ్‌ చేయనప్పుడు వ్యాపిస్తుంది. పాజిటివ్‌ తల్లి నుంచి బిడ్డకు సోకుతుంది. ఆంధ్ర వైద్య కళాశాల కింగ్‌ జార్జి ఆసుపత్రి (విశాఖపట్టణం)లోని మైక్రో బయాలజీ విభాగం సహాయంతో నాటి వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ధనరాజ్‌, కెజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరభద్రయ్యల నుంచి అధికారికంగా అనుమతి తీసుకుని హెపిటైటిస్‌ బి వ్యాధిపైనా పరిశోధనలు సాగించాను. వివిధ విభాగాల లేబరేటరీల్లో పనిచేస్తున్న టెక్నీషియన్లు రక్తం, మూత్ర శాంపిళ్ల సేకరణకు సహకరించారు. ఆ పరిశోధనా పత్రాన్ని బ్రిటన్‌లోని మాంచెస్టర్‌ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో సమర్పించాను. అప్పటికే లండన్‌లో వేలాదిమంది యువకులు హెచ్‌ఐవికి గురైపోయి, దానితో ఒంటరి పోరాటం చేస్తున్న వారిని చూశాను. మాంచెస్టర్‌ ఆసుపత్రిలో హెచ్‌ఐవి వార్డు చూపించమని నేను అడిగితే అక్కడి స్టాఫ్‌ నర్సులు ఎంతో భయాందోళన ప్రదర్శిస్తూ చాలా దూరం నుంచే చూపించారు. వారి ప్రవర్తన నాకు చాలా వింతగా తోచింది. ఆ మరుసటి రోజే నేను ఆ యూనివర్శిటీ అతిథి గృహంలో ఓ పత్రిక చదువుతుంటే అందులో ఓ ఆర్టికల్‌ నన్ను ఆకర్షించింది. పాఠశాలలో ఏడేళ్ల విద్యార్థినిని తోటి విద్యార్థులు రాళ్లతో కొడుతున్నారు. ఎందుకనే ఆసక్తితో మొత్తం ఆర్టికల్‌ చదివాను. ఆ అమ్మాయి తల్లి పాజిటివ్‌ అయినందున తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి ఆ విద్యార్థిని టిసి ఇచ్చేయాలని ఆందోళన చేశారు. తల్లికి సమస్య అయితే ఏ పాపం ఎరుగని ఆ అమ్మాయిని కొట్టడం నా మనసును బాగా కదిలించివేసింది. బ్రిటన్‌ లాంటి అభివృద్ధి చెందిన దేశంలోనే హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ అంటే ఇంత వివక్షతో అంటరానిరోగుల్లా చూడటం తీవ్రంగా బాధేసింది. ఈ వ్యాధి భారత దేశానికి వస్తే బ్రిటన్‌తో పోల్చుకుంటే ఇక్కడ అక్షరాసత్య తక్కువ. మూఢ నమ్మకాలు ఎక్కువ. భారతదేశానికి రాగానే న్యూఢిల్లీలోని ప్రెస్‌క్లబ్‌లో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలా సందేశం ఇచ్చాను.

నాటి నుంచి నేటి వరకూ…

దేశవ్యాప్తంగా కళాశాలలు, లయన్స్‌, రోటరీ లాంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో అవగాహనా కార్యక్రమాల విస్తృతిని పెంచాను. నగరాల్లోని మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల నుంచి గిరిజన తండాల వరకూ వందలు, వేలాదిగా ఎయిడ్స్‌పై అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు వ్యాధి వ్యాప్తి తీరు-నివారణా పద్ధతులుపై సవివరంగా వివరిస్తున్నాను. అద్భుత ఫార్ములాలతో వైద్యం1980వ దశకంలో ఎయిడ్స్‌ వ్యాధి మరణానికి మారుపేరు. 2023లో కూడా దీర్షకాలిక వ్యాధి మాత్రమే. ఎయిడ్స్‌ అని 72 గంటల్లో తేలితే పోస్టు ఎక్ప్లోజర్‌ ప్రొఫలాక్సిస్‌ (పెప్‌) మందులు 28 రోజులు వాడితే పూర్తిగా నెగెటివ్‌ చేసుకునే అద్భుత ఫార్ములాలు నేడు మనకు అందుబాటులోకి ఉన్నాయి. అలసత్వం, ఉదాసీనత లేకుండా షుగర్‌, బీపీ రోగులు వేసుకునే మాత్రలు మాదిరిగానే ఈ మందులు కూడా వేసుకోవాలి. రూ.30 ఖరీదు చేసే ఒక్క మాత్ర రోజూ క్రమం తప్పకుండా వేసుకుంటే ఎయిడ్స్‌ రోగులు కూడా 80 ఏళ్లపాటు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవించొచ్చు. ఈ విషయాన్ని సాక్షాత్తు అంతర్జాతీయ ప్రఖ్యాత వైద్య జర్నల్‌ లాన్సెట్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధక బృందం, సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోలు అమెరికా అధ్యయనాల కేంద్రం ఘంటాపథంగా చెప్పాయి.

శాస్త్రీయ సమాచారం తక్కువే…

చికిత్సల్లో వస్తున్న సరికొత్త మార్పులపై 42 ఏళ్లు కావస్తున్నా నేటికీ శాస్త్రీయ సమాచారం ప్రజానీకానికి అందటం లేదు. వాస్తవానికి హెచ్‌ఐవి పాజిటివ్‌ వ్యక్తులు పెళ్లి చేసుకోవచ్చు. పిల్లల్ని కనొచ్చు. కాబోయే భాగస్వాములకు, పుట్టబోయే బిడ్డలకు 99.9 శాతం వరకూ హెచ్‌ఐవి వ్యాపించకుండా నిరోధించే అధునాతన హార్ట్‌, కాక్టైల్‌, సాల్వెజ్‌ థెరపీ లాంటి ఎన్నో మందులు అందుబాటులోకి వచ్చాయి. చికిత్సలతో జీవితకాలం పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం 3.67 కోట్ల మంది హెచ్‌ఐవితో ప్రపంచవ్యాప్తంగా జీవిస్తుండగా ఏటా మరో 18 లక్షల మంది ఈ వ్యాధి భారినపడుతున్నారు. దేశంలో 23 లక్షల మంది, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4 లక్షల మంది ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులున్నారు. 2030 నాటికి హెచ్‌ఐవితో జీవిస్తున్న వారిలో 73 శాతం 55 ఏళ్లు పైబడతారనీ, 78 శాతం గుండె జబ్బులతో, హార్ట్‌ ఫెయిల్యూర్‌, గుండె రక్త నాళాలకు సంబంధించిన వ్యాధులు, హార్ట్‌ ఎటాక్స్‌, ఆకస్మిక మరణాలు వంటి రోగాలతో అనారోగ్యం పాలవుతారని అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ కార్డియాలజీ ఇటీవలే ప్రకటించింది. హార్ట్‌ థెరపీతో నాణ్యమైన జీవనంహెచ్‌ఐవి అని తెలియగానే సిడి 4 కణాల సంఖ్య బాగా తగ్గిపోయినంత వరకు అశ్రద్ధ చేయకుండా నిజాయితీ గల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆధునిక వైద్యం (హార్ట్‌ థెరపీ) క్రమశిక్షణతో వాడితే రోజుకి రూ.35 ఖర్చుతో అందరిలాగానే ఆరోగ్యంగా 75 ఏళ్ల వరకూ నాణ్యమైన జీవనాన్ని సాగించొచ్చు.
ఎయిడ్స్‌ చికిత్స రంగంలో (హార్ట్‌) ఆవిష్కరణ ఓ అద్భుతం.

పాజిటివ్‌ దంపతులు ఎఆర్‌టి మందులు వాడి హెచ్‌ఐవి సోకని సంతానం అంటే హెచ్‌ఐవి నెగెటివ్‌ పిల్లల్ని కనొచ్చు. ఇది పూర్తిగా చికిత్సకు లంగే వ్యాధి. అందుకే నకిలీ వైద్యాలు, పొడుములు, లేహ్యాలు, అశాస్త్రీయమైన ఏ రుజువులూ కానీ చెట్టు మందులకు స్వస్తి చెప్పి ఏ మాత్రమూ అధైర్య పడకుండా, కృంగిపోకుండా తగు వైద్యంతో హెచ్‌ఐవి రోగులు క్వాలిటీ లైఫ్‌ను నేడు పొందటం సాధ్యమే.

ఒక్క ఇంజక్షన్‌తో మటుమాయం

హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ అంటు వ్యాధి కాదు. వారిని తాకినా, కౌగిలించుకున్నా, ముద్దు పెట్టుకున్నా, వారితో కలిసి జీవించినా ఒకరి నుంచి వేరొకరికి వ్యాప్తి చెందదు. ఆ రోగుల పట్ల ప్రేమ, ఆదరణ ఉండటం మన కనీస బాధ్యత. హెచ్‌ఐవి రహిత సమాజం మనందరి కర్తవ్యం. రోజూ ఎఆర్‌టి మందులు వాడటానికి విసుగు చెందుతున్న రోగులకు రెండు, మూడు నెలలకు లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి కెబోటిగ్రావిర్‌ లాంగ్‌ ఎక్టింగ్‌ ఇంజక్షన్లు, రెండేళ్లు పైబడి పనిచేసే ఎఆర్‌టి ఇంప్లాంట్స్‌ ఆవిష్కరించటం ఓ గొప్ప శుభవార్త.

ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలిడెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులతోపాటు ఎయిడ్స్‌ను కూడా ఆరోగ్యశ్రీ కింద చేర్చాలని కోరుతున్నాను. తద్వారానే నిర్భాగ్య రోగులు, పేద, మధ్యతరగతి ఎయిడ్స్‌ పీడితులకు నాణ్యమైన చికిత్సలు అందుతాయి. లేకుంటే ఆర్థిక స్థోమత లేనివారు సరైన వైద్యం అందక చనిపోతున్నారు. వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కిక్‌ అండ్‌ కిల్‌తో అంతం2012లో జర్మనీలోనూ, 2022లో అమెరికాలోనూ లుకేమియాతో బాధపడుతున్న ఒక మహిళ మూలకణ మార్పిడి ద్వారా హెచ్‌ఐవి నుంచి పూర్తిగా విముక్తి పొందారు. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ పరిశోధనల ప్రకారం బడ్డులోని స్టెమ్‌సెల్స్‌ మార్పిడి ద్వారా పూర్తిగా హెచ్‌ఐవి తగ్గటానికి అవకాశం ఏర్పడింది. మూడు లేదా నాలుగు సంవత్సరాలు ఎఆర్‌టి మందులను ఆపేసినా వీరిలో హెచ్‌ఐవి తిరిగి బయటపడలేదు. 2022 జూన్‌లో టైప్‌-బి తెల్లకణాల్ని జన్యుపరంగా మార్పులు చేసి ఇంజక్షన్‌ రూపంలో ఒకే ఒక్కసారి ఇవ్వటం వల్ల ఎయిడ్స్‌ వ్యాధికి శాశ్వత చికిత్స ఆవిష్కరణైంది. వీటితోపాటు రాక్ఫెల్లర్‌ పౌండేషన్‌ యాంటీబాడీ ఇంజక్షన్ల ఉపయోగం, కిక్‌ అండ్‌ కిల్‌ విధానం లాంటి అత్యాధునిక వైద్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీర్ఘకాలంగా ఒక పక్క వివక్షతకు గురౌతూ, రెండో పక్క పదుల కొద్దీ మాత్రలు వేసుకుంటూ కుంగిపోతున్న అసంఖ్యా ఎయిడ్స్‌ రోగులకు ఇక మంచి రోజులు వచ్చినట్లే.

చికిత్స-పరిశోధనలకు పద్మశ్రీ పురస్కారం

ఎయిడ్స్‌ రంగంలో విశ్వవ్యాప్తంగా శాస్త్రీయ అవగాహన పెంపొందించటం, వ్యాధిగ్రస్తులకు సంఘీభావం తెలపటానికిగాను ప్రపంచంలోనే అతిపెద్ద రెడ్‌రిబ్బన్‌ను ప్రదర్శించాను. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా ఉప ప్రధానమంత్రి పేరునున్న రికార్డును బద్దలు కొట్టి గిన్నిస్‌బుక్‌ వరల్డ్‌ రికార్డు సాధించాను. ఈ రెడ్‌ రిబ్బన్‌ను లండన్‌లోని అనీఫీల్డ్‌ పుట్‌బాల్‌ స్టేడియంలో ఎయిడ్స్‌పై అవగాహన నిమిత్తం రెండేళ్లపాటు ప్రదర్శించారు. ఇది భారతదేశ వైద్యుడిగా నాకు దక్కిన గొప్ప విశేషమైన గౌరవం. పేద ప్రజల కోసం వందలాదిగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుచేశాను. సెక్స్‌ వర్కర్ల పిల్లలు, బడుగు, బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతి కోసం ఉచిత వసతి, భోజనం, విద్య, వైద్యం సదుపాయాలను అందిస్తున్నాను. ఇప్పటివరకూ సుమారు 4000 మంది పిల్లలు సాయం పొందారు. వారిలో చాలామంది నేడు ఢిల్లీ, ముంబై, లండన్‌, జర్మనీ, అమెరికా లాంటి దేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకుని వారి కాళ్లపై వారు నిలబడి ఎంతో గౌరవంగా జీవిస్తున్నారు. వైద్యరంగంలో చికిత్స-పరిశోధనా రంగాల్లో చేస్తున్న కృషికి గుర్తింపుగా 2008లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ గారు దేశంలోనే మూడో అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించారు. బ్రిటన్‌లోని ఎగువ సభ (హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌) మహాత్మా సన్మాన్‌ పేరుతో పురస్కారాన్ని అందజేసింది.

ప్రపంచ గుర్తింపు పొందిన డాక్టర్‌

హార్వర్డ్‌ యూనివర్శిటీ (యుఎస్‌ఎ), కేన్బరా యూనివర్శిటీ (ఆస్ట్రేలియా), కేలగరీ యూనివర్శిటీ (కెనడా) ఫెలోగా సుమారు 56 దేశాల్లో ఆయన ఎయిడ్స్‌ రంగంలో పరిశోధనా పత్రాలు సమర్పించారు. అమెరికా తెలుగు అసోయేషన్‌ (ఆటా) వారు చికాగోలో విశిష్ట పురస్కారంతో సత్కరించారు. బ్రిటీష్‌ మెడికల్‌ జర్నల్‌, డబ్ల్యుహెచ్‌ఒ, న్యూయార్క్‌ టైమ్స్‌, యాంటీ సెప్టిక్‌ (యుకె) వంటి ప్రఖ్యాత జర్నల్స్‌లో 120కి పైగా పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. ఎనిమిది టెక్స్ట్‌బుక్స్‌లో హెపటైటిస్‌, రేబిస్‌, ఎయిడ్స్‌, డయాబెటీస్‌ వంటి వివిధ అంశాలపై ఆంగ్లంలో అనేక పుస్తకాల్లో చాప్టర్లు రాశారు. ఐఎంఎ కాలేజ్‌ (చెన్నై) జాతీయ ప్రొఫెసర్‌గానూ, ఆంధ్రా యూనివర్శిటీ హ్యూమన్‌ జెనెటిక్స్‌ విభాగానికి గౌరవ ప్రొఫసర్‌గానూ, ఇన్ఫెక్టిస్‌ డిసీజెస్‌ సొసైటీ ఆఫ్‌ అమెరికా సభ్యుడిగా ఉన్నాను. కింగ్‌ జార్జి ఆసుపత్రి, ఆంధ్రా మెడికల్‌ కళాశాలకు సంస్థాగత అథెక్స్‌ కమిటీ ఛైర్మన్‌గానూ పనిచేశాను. ఆంధ్రా యూనివర్శిటీ పాలకవర్గ సభ్యుడిగానూ, ఎపి ప్రభుత్వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా గతంలో పనిచేశాను. కంచరపాలెంలో కూటికుప్పల సూర్యారావు ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాను. అందరికీ ఆరోగ్యం…ఎయిడ్స్‌ లాంటి వ్యాధులు లేని నూతన సమాజమే లక్ష్యంగా నా కృషిని నిరంతరం కొనసాగిస్తున్నాను.

-ఇంటర్వ్యూ : యడవల్లి శ్రీనివాసరావు

➡️