కూలీల మరణం బాధాకరం

May 15,2024 22:47 #Acident, #CPM AP, #Konaseema

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద ఆర్‌టిసి బస్సు ఢకొీని నలుగురు కూలీలు మృతిచెందడం బాధాకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు. చనిపోయిన వారు ధాన్యం లోడు చేసే అడ్డా కూలీలని, పేదరికం అనుభవిస్తున్నవారని తెలిపారు. మృతుల కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం కోరారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. కాలంచెల్లిన బస్సులను ఆర్‌టిసి నడుపుతోందని, ఈ ఘటనకు ఎపిఎస్‌ఆర్‌టిసి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు.

రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి
రోడ్డు ప్రమాదంలో మరణించిన ముఠా కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ.వి.నాగేశ్వరరావు, సిహెచ్‌.నరసింగరావు, హమాలీ కార్మికుల రాష్ట్ర ఫెడరేషన్‌(సిఐటియు) రాష్ట్ర కమిటీ కన్వీనర్‌ కె.ఉమామహేశ్వరరావు, కోకన్వీనర్‌ ఎం.సీతారాములు కోరారు. అలాగే గాయపడిన వారికి రూ.25 లక్షల ఆర్థికసాయం అందించాలని కోరారు. ఈ డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికశాఖ అధికారులకు రాయబారాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ముఠా, జట్టు, హమాలీ, కళాశీ కార్మికులకు వారు విజ్ఞప్తి చేశారు.

➡️