బిజెపిని ఓడించండి : 12న విజయవాడలో సదస్సు

Dec 31,2023 12:23 #amaravati, #Conference, #Vijayawada
  • భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బిజెపి, దానికి మద్దతు పలికే ఇతర పార్టీల ఓటమే లక్ష్యంగా ‘ మోడీ హఠావో – దేశ్‌ బచావో’ నినాదంతో విజయవాడలో 12వ తేది భారీ సదస్సు నిర్వహించాలని భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక నిర్ణయించింది. విజయవాడ ఆటోనగర్‌లోని ఎగ్జిబిషన్‌ సొసైటీ హాలులో పరిరక్షణ వేదిక కన్వీనరు వడ్డే శోభనాద్రీశ్వరరావు, అధ్యక్షతన శనివారం జరిగిన మేధోమధనం ఆ సదస్సుకు భారీగా తరలిరావాలని ప్రజానీకానికి పిలుపునిచ్చింది. సంస్ధలు, పార్టీలు, మేధావులు, ప్రజాసంఘాలు, యువత పెద్ద ఎత్తున 12వ తేది సదస్సులో భాగస్వామ్యం కావాలని కోరింది. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ దేశ సంపదను లూఠీ చేసి అదాని, అంబానీలకు మోడీ ప్రభుత్వం కట్టబెడుతోందని మేధోమధనంలో పాల్గొన్న వక్తలు విమర్శించారు. రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసిన మోడీ, అమిత్‌షా, బిజెపితో పాటు ఆ పార్టీకి మద్దతు పలికే పార్టీలను రాబోవు ఎన్నికల్లో ఓడించాలని సదస్సు తీర్మానం చేసింది. విజయవాడలో నిర్వహించనున్న భారీ సమ్మేళనం స్థాయిలో తిరుపతి, కర్నూలు, విశాఖల్లో కూడా సమ్మేళనాలు నిర్వహించాలని కోరింది. దీనికి సన్నాహకంగా 5,6,7 తేదీల్లో జిల్లా స్ధాయిల్లో కూడా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాం హక్కులను కాలరాస్తూ మౌళిక సూత్రాలైన ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకిక తత్వం, ప్రాధమిక హక్కులను మంట గలుపుతోందన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా , వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంద్ర, రాయలసీమ కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మోసం చేసిందన్నారు. ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి కేంద్ర ఫ్రభుత్వం పూనుకుందన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే బాధ్యత తీసుకుని పూర్తి చేస్తామని ప్రకటించి నేడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేస్తోందని విమర్శించారు. బిజెపి ఓటు బ్యాంక్‌ కోసం మతాన్ని తెరమీదకు తెచ్చిందన్నారు. మతోన్మోద రాజకీయాలను తిప్పికొట్టి లౌకిక శక్తులను బలోపేతం చేసేందుకు బలమైన కూటమి అవసరమన్నారు. భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రత్యక్షంగా తమ మద్దతు ఉంటుదని ప్రకటించారు. బిజెపికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో సోషల్‌ మీడియా వేదికను బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు. టిడిపి, వైసిపిలు సహకారం అనే పేరుతో బిజెపికి దగ్గరగా ఉన్నాయని, ఆయా పార్టీల మీద వత్తిడిని పెంచాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

సిపిఐ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూపరిషత్‌, బిజెపి అన్ని కలిసి మత అంశాలను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నాయన్నారు. ప్రతిపక్ష నాయకులపై సిబిఐ, ఇడిలను ప్రయోగించి కేసులను బనాయిస్తోందని చెప్పారు. వీటిని బూచిగా చూపించి ప్రాంతీయ పార్టీల నేతలను లొంగదీసుకుంటోందన్నారు. బిజెపి మతోన్మాదాన్ని ఎదుర్కొనేందుకు లౌకికశక్తులు, ప్రజాతంత్రవాదులు అందరూ కలిసి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. రాజ్యాంగ రక్షణకు ప్రతి ఒక్కరూ నడుంకట్టాలన్నారు. గ్రామస్ధాయి నుంచి బిజెపి వ్యతిరేక పోరాటాలను ఉదృతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని వారు సూచించారు. జనవరి 26న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని, అదే విధంగా రాజ్యాంగ స్పూర్తిని మోడీ ప్రభుత్వం ఎలా తూట్లు పొడుస్తుందనే అంశంపై బుక్‌లెట్లు పంపిణీ చేయాలని, మేలుకో కర్నాటక తరహాలో మేలుకో ఆంధ్ర పేరుతో మేథావులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.మధు, వైవి, గఫూర్‌, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు ఓబులేశు, సిఐటియు నాయకులు యు. ఉమామహేశ్వరరావు, ప్రత్యేక హోధా సాధనా సమితి నాయకులు చలసాని శ్రీనివాసరావు, కె. విజయరావు, రైతు సంఘం నాయకులు వి.కృష్ణయ్య, కెవి ప్రసాద్‌, సినీ నిర్మాత సత్యారెడ్డి, సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఆళ్ల గోపాలకృష్ణ, అడ్వకేట్‌ మేళం భాగ్యారావు, పట్నాయక్‌, భాస్కరరావు, పాల్గొన్నారు. సదస్సు ప్రారంభంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు వి. వెంకటేశ్వర్లు తీర్మానాలను ప్రవేశ పెట్టారు.

➡️