రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలను ఓడించండి- సిపిఎం అభ్యర్థుల ప్రచారం

May 7,2024 22:01 #cpm, #pracharam

ప్రజాశక్తి -యంత్రాంగం :వారం రోజుల్లో ఎన్నికల పోలింగ్‌ జరగనుండడంతో సిపిఎం అభ్యర్థులు మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పోటీ చేస్తున్న స్థానాల్లో విస్తృతంగా ప్రచారం సాగించారు. ఒకవైపు బిజెపి, వైసిపి, టిడిపి, జనసేన వైఫల్యాల గురించి గడపగడపకు తీసుకెళ్తూ ప్రజలకు వివరిస్తూనే… మరోవైపు ఆత్మీయ సమావేశాలు, రోడ్‌ షోలు, పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై పోరాడే వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, దానికి మద్దతు ఇస్తున్న పార్టీలను చిత్తుగా ఓడించాలని కోరారు.

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ, సీతానగరం మండలాల్లో అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్స, కురుపాం అసెంబ్లీ అభ్యర్థి మండంగి రమణను గెలిపించాలని కోరుతూ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసగించేందుకు కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి, టిడిపి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాల డబ్బులు ప్రజల నుండి వసూలు చేస్తున్నవే తప్ప వారి సొంత డబ్బులు కాదని, దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారాలను మోపి వారి జీవన ప్రమాణాలు దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలు, కార్మికులు, రైతాంగానికి నష్టదాయకమైన జిఒలు తెచ్చి వారి బతుకులను ఛిద్రం చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

గుంటూరు జిల్లా ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లిలో మంగళగిరి అభ్యర్థి జన్న శివశంకరరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం నిరంతరం పోరాడేది ఎర్రజెండా మాత్రమేనని తెలిపారు. ప్రజలు ఆదరించాలని కోరారు. ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఎస్‌కె సలీమ్‌ పాల్గని మద్దతు తెలిపారు.
విజయవాడ 33వ డివిజన్‌ సత్యనారాయణపురంలో సెంట్రల్‌ నియోజకవర్గం అభ్యర్థి చిగురుపాటి బాబూరావు కాంగ్రెస్‌, సిపిఐ, ఆమ్‌ ఆద్మీ పార్టీల నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గాన్ని సమస్యాత్మక నియోజకవర్గంగా చేసిన పాపం వైసిపి, టిడిపిలదేనంటూ విమర్శించారు. నగరంలో ప్రశాంత వాతావరణానికి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

విశాఖ 69వ వార్డులోని షీలానగర్‌ పరిసర ప్రాంతాల్లో గాజువాక అభ్యర్థి ఎం.జగ్గునాయుడు ప్రచారం చేపట్టారు. తాను గెలిస్తే స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం అభ్యర్థి లోతా రామారావు పర్యటించారు. తొలుత ఎటపాక మండలంలో రోడ్‌ షో నిర్వహించారు. లక్ష్మీపురం నుంచి ప్రారంభమై రోడ్‌ షో గన్నవరం, తోటపల్లి, నెల్లిపాక, చోడవరం, కొండపల్లి, గుండాల కాలనీ మీదుగా ఎటపాక వరకూ సాగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌, సిపిఐ నాయకులు పాల్గన్నారు. అప్పలనర్స, లోతా రామారావులను గెలిపించాలంటూ అడ్డతీగల మండల కేంద్రంలోని వారపు సంతలో కళాజాతాలతో ప్రచారం చేపట్టారు.

నెల్లూరులోని 10, 11 డివిజన్ల పరిధిలో నియోజకవర్గ అభ్యర్థి మూలం రమేష్‌ ప్రచారం నిర్వహించింది. ప్రజలపై అనేక రూపాల్లో పన్నులు వసూలు చేస్తూ ఆర్ధిక భారాలు మోపుతున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

➡️