ఉద్యోగ భద్రత కల్పించండి

Dec 19,2023 08:43 #Dharna, #Electricity, #workers
  • ఎస్‌ఇ కార్యాలయాల ఎదుట విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ధర్నా

ప్రజాశక్తి – యంత్రాంగం :తమను రెగ్యులరైజ్‌ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తెలంగాణలో మాదిరి డైరెక్ట్‌ పేమెంటు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఎపిఎస్‌పిడిసిఎల్‌, ఇపిడిసిఎల్‌, సిపిడిసిఎల్‌ ట్రాన్స్‌కో ఎస్‌ఇ కార్యాలయాల ఎదుట యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. షిప్ట్‌ ఆపరేటర్లు, మీటర్‌ రీడర్లు, సెక్షన్‌ ఆపరేటర్లు, స్టోర్స్‌ పనిచేస్తోన్న హమాలీలకు కనీస వేతనాలు చెల్లించాలని కోరారు.

విజయవాడ గుణదలలోని ట్రాన్స్‌కో సూపరిటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సంస్థలోని కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని, 2022 పిఆర్‌సి ప్రకారం బేసిక్‌ వేతనాలు చెల్లించి ఎరియర్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న పెయిడ్‌ హాలీడేస్‌ వేతనాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కొత్తగా నియమితులైన షిఫ్ట్‌ ఆపరేటర్లకు, వాచ్‌మెన్లుగా పనిచేస్తూ షిఫ్ట్‌ ఆపరేటర్లుగా నియమితులైన వారికి పాత ఆపరేటర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని కోరారు. అనంతరం ట్రాన్స్‌కో ఎస్‌ఇ, డిస్కం ఎస్‌ఇలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ ధర్నాలో యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్మన్‌ రెడ్డి, సిఐటియు ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు ఎన్‌సిహెచ్‌.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో స్థానిక శ్రీనివాసపురంలోని ఎస్‌పిడిసిఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కర్నూలులోని ఎస్‌సి కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కడప విద్యుత్‌ భవన్‌ ఎదురుగా ధర్నా నిర్వహించారు. తమ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామని, మిగతా వాటిని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎస్‌ఇ హామీ ఇచ్చారు. అనంతరం కార్మికులు ధర్నాను విరమించారు. విశాఖలోని గ్రీన్‌ పార్క్‌ ఎదురుగా ఉన్న ఎపి ఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఒంగోలులో ఆందోళన చేపట్టారు.

➡️