శ్రీ చైతన్య కళాశాలపై చర్యలు తీసుకోవాలని ధర్నా

ప్రజాశక్తి – కలెక్టరేట్‌, సీతమ్మధార (విశాఖపట్నం) : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల వ్యాపారం చేస్తున్న కార్పొరేట్‌ విద్యా సంస్థ శ్రీచైతన్య కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ రామాటాకీస్‌ సమీపంలోని శ్రీ చైతన్య కాలేజీ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో కళాశాల యాజమాన్యం విద్యార్థి సంఘం నాయకులపై దురుసుగా ప్రవర్తించింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి జి.అజరు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలోని కార్పొరేట్‌, ప్రయివేట్‌ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా యూనిఫారాలు, షూలు, పుస్తకాలు విక్రయిస్తూ పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నాయన్నారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక భారం పడుతోందన్నారు. ఇంటర్‌మీడియట్‌ బోర్డు, ప్రభుత్వ అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో శ్రీ చైతన్య, నారాయణ, ఫిట్జీ, తిరుమల, శ్రీ విశ్వా, భాష్యం, రవీంధ్రభారతి, పెన్‌ స్కూల్‌, విజ్ఞాన్‌, గాయత్రి, ఆకాష్‌, పొలక్స్‌, లిటిలేంజస్‌, అసెంట్‌ కాలేజీలతోపాటు పలు విద్యా సంస్థలు పుస్తకాల వ్యాపారాలు నిర్వహిస్తూ జేబులు నింపుకుంటున్నాయని తెలిపారు. ఆర్‌ఐఒ తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోని పక్షంలో అన్ని కాలేజీలు, స్కూళ్ల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి.సాయితేజ, జిల్లా నాయకులు అఖిల్‌, హర్షిత్‌, సూర్య, విద్యార్థులు పాల్గొన్నారు.

పుస్తకాల గది సీజ్‌
ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన విషయం తెలిసి ఆర్‌ఐఒ కార్యాలయ సిబ్బంది శ్రీచైతన్య కళాశాల వద్దకు చేరుకుని పుస్తకాల గదిని సీజ్‌ చేశారు. దీంతో విద్యార్థి సంఘం నాయకులు శాంతించారు.

➡️