అంతరాలు చెరిపేశాం

-పెద్దలకో న్యాయం… పేదలకో న్యాయం ఉండకూడదని పెనుమార్పులు

-ఒంగోలులో ఇళ్ల స్థలాల భూ హక్కు పత్రాల పంపిణీ సభలో సిఎం జగన్‌

ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో :రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశం మొదలు విద్య, వైద్యం అనేక విషయాల్లో పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయం ఉండకూడదనే ఉద్దేశంతో పాలనాపరంగా విప్లవాత్మక చర్యలు చేపట్టి అంతరాలను చెరిపేశామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు కోర్టుల ద్వారా అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని, వంద మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గుడని దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులోని అగ్రహారంలో శుక్రవారం జరిగిన ఇళ్ల స్థలాల భూ హక్కు పత్రాల పంపిణీ సభలో జగన్‌ మాట్లాడారు. పేదలందరికీ మంచి చేయాలనే తలంపుతో రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ప్లాట్లు, ఇళ్ల రూపేణా అందజేశామన్నారు. పదేళ్ల తర్వాత దీనిపై సర్వాధికారాలు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో 15 వేల లేఅవుట్లలో రూ.32 వేల కోట్ల ఖర్చుతో 22 లక్షల ఇళ్లు ఇచ్చామన్నారు. వాటిల్లో 8.90 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. 2020 ఉగాది నాటికే ఇవ్వాలని భావిస్తే చంద్రబాబు, ఆయన మనుషులు అనేక ఆటంకాలు కలిగించారని, కోర్టులకు వెళ్లి ఆపే యత్నాలు చేశారని విమర్శించారు. ఇళ్ల స్థలాలు ఇస్తుంటే వద్దంటూ 1,191 కేసులు వేశారని ధ్వజమెత్తారు. ఒంగోలులో న్యాయపరమైన చిక్కులు అధిగమించి 21 వేల మందికి పట్టాలు ఇస్తున్నామన్నారు. వీటితోపాటు ఇళ్లనూ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ధనికుల పిల్లలకు, పేదల పిల్లలకు మధ్య అంతరం చెరిపేసేందుకే ప్రభుత్వ బడుల్లోనూ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టామన్నారు. ధనికులకే అందుబాటులో ఉండే కార్పొరేట్‌ వైద్యం పేదలకు అందించేందుకు ఆరోగ్యశ్రీలో 3,300 రకాల వ్యాధులను చేర్చామని తెలిపారు. రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం కల్పించామన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌, విలేజీ క్లినిక్‌లు, ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలతో పేదలకు ఇంటి వద్దకే వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారిత కోసం చేపట్టిన పథకాల వల్ల వారికి భద్రత పెరిగిందని పేర్కొన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు బటన్‌ నొక్కుడుతోనే రూ.2.55 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్లాయన్నారు. నామినేటెడ్‌ పదవుల్లోనూ 50 శాతం పేదలకు ఇచ్చామని తెలిపారు. మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగిందనిపిస్తే మీ బిడ్డను దీవించాలని కోరారు. రూ.334 కోట్లతో ఒంగోలు నగరానికి రోజు తాగునీరు అందించే పథకానికి సిఎం జగన్‌ అక్కడే శంకుస్థాపన చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించిన ఈ సభలో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, మేరుగ నాగార్జున, వైసిపి కో-ఆర్డినేటర్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మేయర్‌ సుజాత, ఎమ్మెల్యే కరణం బలరాం, జిల్లాలోని పలువురు శాసనసభ్యులు పాల్గన్నారు. ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

ప్రజాసంఘాల నాయకుల అరెస్టు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒంగోలు పర్యటన నేపథ్యంలో పలువురు ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) జిల్లా కార్యదర్శి కొర్నెపాటి శ్రీనివాసరావును టూ టౌన్‌ పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేసి ఆ తర్వాత విడిచిపెట్టారు. మరలా శుక్రవారం ఉదయం అరెస్టు చేసి సాయంత్రం వరకు పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వినోద్‌ను వన్‌టౌన్‌ పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేసి సాయంత్రం విడిచి పెట్టారు.

 

 

➡️