మా ఊరు రావద్దు

స్పీకర్‌ వాహనానికి ఆటో అడ్డం పెట్టిన చిన్నషళంత్రి గ్రామస్తులు
ప్రజాశక్తి – సరుబుజ్జిలి, ఆమదాలవలస (శ్రీకాకుళం జిల్లా)
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం చిన్న షళంత్రిలో శాసనసభ స్పీకర్‌, ఆమదాలవలస వైసిపి అభ్యర్థి తమ్మినేని సీతారాంకు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. షళంత్రిలో ప్రచారానికి వెళ్లిన ఆయన వాహనానికి మహిళలతో కూడిన ఆటో అడ్డం పెట్టి గ్రామస్తులు నిరసన తెలిపారు. ఆటోను పక్కకు తీయాలని ఆటో డ్రైవర్‌ను స్పీకర్‌ అంగరక్షకులు కోరగా, ఆటో స్టార్ట్‌ కావడం లేదని ఆయన బదులిచ్చాడు. దీంతో డ్రైవర్‌పై వైసిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఆటోలోని మహిళలు వారితో వాగ్వాదానికి దిగారు. తమ గ్రామానికి ఇంతవరకు రహదారి వేయలేదని, అందుకే తమ గ్రామానికి ఓటు అడగడానికి రావద్దని తేల్చిచెప్పారు. రోడ్డు కోసం ఐదేళ్లలో పలుమార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓటు కోసం వస్తారని ప్రశ్నించారు. స్పీకర్‌ కారు ఎదుటే ఇంత రాద్ధాంతం జరుగుతున్నా మిన్నకున్న ఆయన చివరలో కలుగజేసుకుని ఇటువంటివి మామూలేనని, ఆటో డ్రైవర్‌ని ఏమీ అనొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. గ్రామంలోకి వెళ్లకుండానే అక్కడే ప్రచార రథంపై ఆయన మాట్లాడారు. గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉంటాయని, వాటిని తన దృష్టికి తీసుకురావాలి తప్ప ఇటువంటి చర్యలు సరికాదన్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిచిన వెంటనే చిన్న షళంత్రికి రహదారిని వేసి, గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీనిచ్చి అక్కడ్నుంచి వెనుదిరిగారు.

➡️