వలంటీర్ల విషయంలో జోక్యం చేసుకోం

  • ఆ విషయంపై నిర్ణయం ఎన్నికల సంఘానిదే
  • గత ప్రభుత్వంపై సిఎం విమర్శలు తప్పుకాదు: హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల విధుల్లో వలంటీర్లను వినియోగించుకోవాలా? వద్దా అనే విషయంలో తాము జోక్యం చేసుకోజాలమని, దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘం (ఇసి) అని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం తేల్చి చెప్పింది. అలాగే పల్నాడు జిల్లాలో గ్రామ, వార్డు వలంటీర్ల అవార్డుల ప్రదాన సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్పుకాబోదని కూడా పేర్కొంది. పల్నాడు సభలో సిఎం ప్రసంగిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబును విమర్శించారని, అందువల్ల ఆయన ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా పరిగణించి సభకు అయిన ఖర్చును రాబట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బెంచ్‌ డిస్మిస్‌ చేసింది. సిఎం ప్రసంగంలో తప్పేముందని పిటిషనరును నిలదీసింది. ప్రసంగం చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని కోరడం పట్ల ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలను, ప్రస్తుత వలంటీరు వ్యవస్థను సిఎం పోల్చి ప్రసంగించడంలో తప్పు ఎలా అవుతుందని నిలదీసింది. వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచేలా ఇసికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ ప్రకాశం జిల్లా, అన్నంబొట్లవారిపాళెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య పిల్‌ దాఖలు చేశారు. ఇందులోనే పల్నాడు జిల్లాలో వలంటీర్ల వ్యవస్థ-జన్మభూమి కమిటీలను పోల్చి సిఎం ప్రసంగించడాన్ని తప్పుపట్టారు.
వలంటీరు వ్యవస్థను రద్దు చేయాలని పిల్‌
గ్రామ, వార్డు వలంటీరు వ్యవస్థ ఏర్పాటుకు 2019లో ప్రభుత్వం జారీ చేసిన జిఓ 104, దానికి సంబంధించిన ఇతర జిఓలన్నీ చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కడప జిల్లా, రాజంపేటకు చెందిన షేక్‌ అబూబాకర్‌ సిద్దిఖీ పిల్‌ దాఖలు చేశారు. ఇదే అంశంపై గతంలో పిల్‌ దాఖలైనందున అందులో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను పిటిషనరు పరిశీలించాలని, ఆ తర్వాత తాజా పిల్‌పై విచారణకు నిర్ణయిస్తామని ప్రకటించింది. విచారణను ఈ నెల 20కు వాయిదా వేస్తున్నట్లు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం ప్రకటించింది.

➡️