అంగన్‌వాడీల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా ? : వి శ్రీనివాసరావు ప్రశ్న

ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అంగన్‌వాడీల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా? అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు ఆందోళనలు, సమ్మెల బాటపట్టినా సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి నిర్బంధం ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. శనివారం అరకులోయలోని గిరిజన సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లే అంగన్‌వాడీలు సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. ఐదు రోజులుగా వారు సమ్మె చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం, రాష్ట్రంలో నిధులు లేవని చెప్పి తప్పించుకోవడం సరికాదని చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఈ ప్రభుత్వానికీ తగిన గుణపాఠం తప్పదన్నారు. అంగన్‌వాడీలకు జీతాలు పెంచకుండా చర్చలు ఎవరి కోసమని ప్రశ్నించారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, వైసిపి నాయకులు, ఎమ్మెల్యేలు పూనుకోవడం తగదన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొడుతున్న చర్యలు మానుకోవాల న్నారు. సమ్మె నోటీసు ఇచ్చిన వెంటనే అంగన్‌వాడీల తో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించి ఉంటే, సమ్మె వరకూ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలకు, గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. సమ్మెకు దిగిన తరువాత ‘సమ్మె చేయకండి… ఎన్నికల తరువాత ఆలోచిద్దాం’ అని చెప్పడం సరికాదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కంటే జీతం ఎక్కువ ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీనే నేడు అంగన్‌వాడీలు నెరవేర్చాలని అడుగుతున్నారని, గొంతెమ్మ కోరికలేవీ కోరడం లేదని వివరించారు. గత ప్రభుత్వం పెంచిన వేతనాలను ఈ ప్రభుత్వం పెంచినట్టు గొప్పలు చెప్పడం తగదని పేర్కొన్నారు. అంగన్‌వాడీలు, ఆశాలు తలుచుకుంటే ఈ ప్రభుత్వానికి భవిష్యత్తు ఉండదన్న విషయం గుర్తెరగాలన్నారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగులు ధర్నాలు, సమ్మెలకు వెళ్లకముందే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

జిఒ నెంబర్‌ 3 పై మౌనం ఎందుకు ?

జిఒ నెంబర్‌ 3పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆ జిఒ రద్దుతో గిరిజన ప్రాంత నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. తుపాను కారణంగా గిరిజన ప్రాంతంలో వరి, రాజ్మా, రాగులు, సామలు, వివిధ రకాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీనిపై గ్రామాల్లో అధికారులు సర్వే చేసి అంచనా కట్టి పంట నష్టపరిహారం ఇవ్వాల్సి ఉన్నా ఆ ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం దారుణమన్నారు. ఏజెన్సీలో స్పెషల్‌ డిఎస్‌సి తీస్తామని చెప్పిన ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ఒక్క నోటిఫికేషనూ ఇవ్వలేదన్నారు. దీంతో, డిగ్రీ, పిజిలు, బిఇడి చదివిన లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కరువైందని తెలిపారు. మాతృభాష వలంటీర్లకు ఐదు వేల రూపాయలు ఇచ్చి వారితో వెట్టి చాకిరీ చేయించుకున్నారన్నారు. తక్షణమే వారిని పర్మినెంట్‌ చేసి ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు, హైవే రోడ్డు నిర్మాణం వల్ల గిరిజనుల భూములకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. గ్రామ సభల తీర్మానం లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదానీని, కాంట్రాక్టర్లను పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, కిల్లో సురేంద్ర, అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, అనంతగిరి జడ్‌పిటిసి సభ్యులు దీసరి గంగరాజు, నాయకులు చిన్నయ్యపడాల్‌, వి.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

➡️