మోసకారి సంక్షేమాన్ని చూసి మోసపోవద్దు

Jan 20,2024 07:51 #Nara Chandrababu, #speech

– రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం

– రివర్స్‌ గేర్‌లో జగనన్న బాణం

రా..కదలిరా సభల్లో చంద్రబాబు నాయుడు

ప్రజాశక్తి- వెంకటగిరి తిరుపతి జిల్లా, కడప ప్రతినిధి :జగన్‌ మోసకారి సంక్షేమాన్ని చూసి మోసపోవద్దని, ఒక చేత్తో రూ.15 పైసలిచ్చి మరో చేత్తో రూపాయి లాక్కుంటున్నారని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. ‘నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి’ అనే పేరుతో జగన్‌ అధికారానికి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వస్తే సంపద సృష్టించి రాష్ట్రాభివృద్ధికి పాటుపడతానని, సాగునీటి ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టిస్తానని, రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం వైఎస్‌ఆర్‌, తిరుపతి జిల్లాల్లో రా..కదలిరా సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. సాగర్‌ నీటిని నల్లమలలో టన్నెల్‌ తవ్వి నంద్యాల జిల్లా బనకచర్లలో పోసి రాయలసీమ తల రాతనే మారుస్తామని అన్నారు. వైసిపి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలను పెంచబోమని హామీనిచ్చి తొమ్మిదిసార్లు పెంచారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లూ కరెంటు ఛార్జీలను పెంచబోమని, ఇదే సమయంలో చేనేతలకు 200 యూనిట్లు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 29 మంది దళిత ఎమ్మెల్యేలను ట్రాన్స్‌ఫర్‌ చేయడం దారుణమన్నారు. ‘వైసిపి నేతలు ఇసుక నుంచి తైలం తీస్తారు.పెన్నా నది నుంచి ఇసుకను దొంగ రవాణా చేస్తారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి జగన్‌ తన కడుపు నింపుకుంటున్నారు’ అని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, పులివెందులలో దళిత మహిళ నాగమ్మ హత్య మొదలుకుని ఓ ఎమ్మెల్సీ తన డ్రైవరును చంపి కారులో డోర్‌ డెలివరీ చేయడం ఏ రకమైన సామాజిక సాధికారత అంటూ ఎద్దేవా చేశారు. తన చిన్నాన్న వైఎస్‌ వివేకాను చంపి ఇతరులపై నిందమోపడం దారుణమన్నారు. తన సోదరుడైన కడప ఎంపిని కాపాడుకోవడానికి సిబిఐపైనే కేసులు పెట్టగలగిన తెంపరితనాన్ని చూస్తే పోలీసులను సైతం చంపి ఆత్మహత్యలుగా చిత్రీకరించే అవకాశం ఉందన్నారు. జగనన్న వదిలిన బాణం రివర్స్‌గేర్‌లో పయనిస్తోందని ఎద్దేవా చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి వైసిపి ఇన్‌ఛార్జి ఇసుక దోపిడీ, గ్రావెల్‌ దందా, క్వార్జ్‌ తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి నెలకొందన్నారు. కెజిఎఫ్‌ త్రీగా ఈ ప్రాంతాన్ని మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మొన్నటి వరకు నాస్తికుడని, ఇప్పుడేమో టిటిడి చైర్మన్‌గా వెలగపెడుతున్నారని విమర్శించారు. తిరుపతి, నెల్లూరు ఐటి హబ్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు. 16 లక్షల కోట్లు పెట్టుబడులను తాము తెస్తే.. నిరుద్యోగాన్ని సిఎం పెంచిపోషించారని విమర్శించారు.తాము ఐటి ఉద్యోగాలిస్తే వైసిపి ప్రభుత్వంలో వలంటీర్ల ఉద్యోగాలు, బ్రాందీ షాపులో ఉద్యోగాలు, పిష్‌ మార్కెట్‌ ఉద్యోగాలిచ్చారని ఎద్దేవా చేశారు. తిరుపతిలో రూ. నాలుగు వేల కోట్ల పిడిఆర్‌ బాండ్ల పేరుతో దోచారని ఆరోపించారు. ప్రజా సంపద, ప్రజలందరి కోసం వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️