బెదిరిస్తే బెదిరిపోం: అంగన్‌వాడీల దీక్షలో వక్తలు

Jan 10,2024 11:35 #Anganwadi strike

సమస్య పరిష్కరించే వరకూ సమ్మె విరమించబోమని హెచ్చరిక

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎస్మా ప్రయోగించడం ద్వారా కార్మిక వర్గాన్ని, సమ్మెలో ఉన్నవారిని బెదిరించాలని చూస్తే బెదిరిపోబోమని, ఇలాంటి ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలు కార్మికుల్లో పట్టుదలను మరింత పెంచుతా యని వక్తలు పేర్కొన్నారు. విజయవాడ ధర్నా చౌక్‌లో జరుగుతున్న అంగన్‌వాడీ సంఘాల దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నరసింగరావు మాట్లాడుతూ.. కార్మిక సంఘాలు సమ్మెలకు దిగడం వారి హక్కని, వారి సమస్యలను చర్చల రూపంలో పరిష్కరించాలని కోరారు. ఎస్మా ప్రయోగిస్తాం, బెదిరిస్తాం అంటే కుదరదని అన్నారు. ఎస్మాలు ప్రయోగించడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత జఠిలం అవుతుందని పేర్కొన్నారు. గత నాలుగు దశాబ్దాల్లో ఏ ప్రభుత్వమూ ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. దీన్ని కూడా సహించలేకపోతే ఎలాగని ప్రశ్నించారు. వేతనాలు పెంచ బోమని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారని, అదే జరిగితే సిఎం ఇంటి బాటపట్ట డం ఖాయమని అన్నారు. సమ్మెను రాజకీయం చేస్తున్నామని అంటు న్నారని, అంగన్‌వాడీల్లో అన్ని పార్టీలకు చెందిన మహిళలున్నారని తెలిపారు. తమ ఆందోళన న్యాయబద్ధమైందని, అందుకనే పట్టుదలతో చేస్తున్నారని అన్నారు. ఎవరి భోజనం వారు తెచ్చుకుంటున్నారని, దీనిలో రాజకీయం ఏముందో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. యూనియన్‌ అధ్యక్షులు బేబీరాణి మాట్లాడుతూ.. 11 సమస్యల్లో పది సమస్యలు పరిష్కరించామని చెబుతూ నాలుగు జిఓలే ఇచ్చారని, మిగిలిన ఆరు జిఓలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కీలకమైన వేతనాల పెంపు అంశాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలితమ్మ మాట్లాడుతూ.. సమ్మె డిమాండ్లను పరిష్కరించని అధికారులు అర్ధరాత్రులు ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తున్నారని, ఇదేమి ప్రజాస్వామ్యమో అర్థం కావడం లేదని అన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్‌సిహెచ్‌ సుప్రజ, సిఐటియు నాయకులు ఎంవి సుధాకర్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

➡️