జయదేవ్‌కు తలుపులు తెరిచే ఉంటాయి

Jan 29,2024 10:40 #Andhra Pradesh, #Nara Lokesh

 ఆత్మీయ సమావేశంలో నారా లోకేశ్‌

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ఎంపి గల్లా జయదేవ్‌ రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించినా టిడిపిలో ఆయనకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గల్లా జయదేవ్‌ ఆదివారం గుంటూరులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో లోకేశ్‌ పాల్గొని మాట్లాడారు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాటం చేసిన వ్యక్తి గల్లా జయదేవ్‌ అని, పార్టీ మారాలని వైసిపి ఆనేక ఇబ్బందుల పెట్టినా లెక్క చేయని వ్యక్తని తెలిపారు. పార్టీ మారే చరిత్ర గల్లా వంశంలో లేదన్నారు. గెలిచే అవకాశం ఉన్న గుంటూరు పార్లమెంట్‌ టిక్కెట్‌ ఎవరైనా వదులు కుంటారా? అని ప్రశ్నించారు. జయదేవ్‌ రాజకీయాల నుంచి తప్పుకున్నా టిడిపిలోనే ఉంటారని తెలిపారు. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, కనకమేడల పార్లమెంటును శాసించే వారన్నారు. నీతి నియమాలతో పెరిగిన కుటుంబం తమదని అన్నారు. గతంలో కాంగ్రెస్‌లో పని చేశామని, ఎప్పుడూ వ్యాపారాలకు ఇబ్బంది రాలేదని తెలిపారు. 2014లో ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్‌ నుంచి టిడిపిలోకి వచ్చామని, గుంటూరు వాసులంతా జయదేవ్‌ను అక్కున చేర్చుకున్నారని చెప్పారు. తామంతా వైసిపిలో చేరుతున్నట్టు కొంతమంది తప్పుడు ప్రచారం చేశారని, తాము ఏ పార్టీలోకి వెళ్లేదిలేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. పార్లమెంటులో మాట్లాడేందుకు జయదేవ్‌ బాగా ప్రోత్సహించారని తెలిపారు. ఎన్నో విషయాలపై ఇద్దరం కలిసి పార్లమెంటులో మన వాణి వినిపించామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఎంతో గొప్పగా జయదేవ్‌ పార్లమెంటులో మాట్లాడారన్నారు. ఎంపి జయదేవ్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పార్లమెంటులో పోరాడుతూనే ఉన్నామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ ఎంపిలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు భరించామన్నారు. కేంద్రాన్ని నిలదీసినందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వ్యాపారపరంగా ఇబ్బంది పెట్టిందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు.

➡️