రాయి దెబ్బకే హత్యాయత్నం కేసా? :డాక్టర్‌ నర్రెడ్డి సునీత

ప్రజాశక్తి – వేంపల్లె : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై పిల్లవాడు రాయి విసిరితే హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఏంటని డాక్టర్‌ నర్రెడ్డి సునీత ప్రశ్నించారు. ఆదివారం వేంపల్లెలోని పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటివల బస్సు యాత్రలో జగన్‌పై డబ్బులు ఇవ్వలేదనే కారణంతో పిల్లవాడు రాయిని విసిరాడన్నారు. రాయి విసరాడనే నేపంతో పిల్లవాడుపై పోలీసులు హత్యాయత్నం కింద నాన్‌ బెయిలబుల్‌ కేసును పెట్టి జైలుకు పంపంచారని చెప్పారు. పులివెందుల నియోజకవర్గంలోని మురారిచింతల గ్రామంలో వృద్ధ దంపతులపై వైసిపి నాయకులు దాడి చేస్తే అలాంటి వారిపై మాత్రం బెయిలబుల్‌ కేసు పెట్టడం ఎంత వరకు న్యాయమో చెప్పాలని ప్రశ్నించారు. బెయిలబుల్‌ కేసు పెట్టడం వల్ల వృద్ధ దంపతులపై దాడి చేసిన వ్యక్తులు దర్జాగా బయట తిరుగు తున్నట్లు చెప్పారు. మురారిచింతల దాడి విషయం తాను బయటికి తేవడంతో అవినాష్‌రెడ్డికి, వైసిపికి భయం పట్టుకుందన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎవరూ దాడులు చేయవద్దని కార్యకర్తలకు వైసిపి ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. అన్యాయం జరుగుతుందని గొంతు అరిచి చెప్పుతుండడంతో వైసిపి భయంతో వణుకు తున్నట్లు చెప్పారు. వైసిపి నాయకులు ఎక్కడెక్కడ గొడవ చేస్తున్నారో ప్రజలు ధైర్యంగా బయట పెట్టాలని కోరారు. విలేకరుల సమావేశంలో పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి ధృవకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️