డా. బిఆర్ఏయూలో నూతన నియామకాలు

Mar 12,2024 18:37 #D.B.R.A.U

రెక్టార్ గా ఆచార్య బి.అడ్డయ్య

 రిజిస్ట్రార్ గా ఆచార్య పి.సుజాత

ఎచ్చెర్ల : డా. బిఆర్ అంబేద్కర్ యూనివర్శిటీలో పాలన పరమైన మార్పులు జరిగాయి. వర్శిటీ రెక్టార్ గా సీనియర్ అధ్యాపకులు ఆచార్య బి. అడ్డయ్య, రిజిస్ట్రార్ గా మరో సీనియర్ అధ్యాపకులు ఆచార్య పి. సుజాతలు నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాలను వర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ఆర్.రజని, వారిద్దరుకు తన ఛాంబర్ లో అందజేశారు.

రెక్టార్ గా నియమితులైన అచార్య అడ్డయ్య ఇప్పటి వరకూ రిజిస్ట్రార్ గా సేవలందించారు. దీంతో పాటుగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా కూడా వ్యవహరిస్తున్నారు. వర్శిటీ ఏర్పడిన తర్వాత మూడో రెక్టార్ గా ఆచార్య అడ్డయ్య నియమితులయ్యారు. 1994లో ఆర్థికశాస్త్రం విభాగంలో రీసెర్చి అసిస్టెంట్ గా డా. బిఆర్ఏయూలో కెరీర్ ను ప్రారంభించిన ఆచార్య అడ్డయ్య 2012లో ఫ్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. ఉత్తమ అధ్యావకుడి అవార్డులను 2015లో రాష్ట్ర ప్రభుత్వంచే, 2018లో డా. బిఆర్ఏయూచే అందుకున్నారు. వర్శిటీ పాలకమండలి సభ్యునిగా, పలు కమిటీల్లో సభ్యునిగా, ఛీప్ ఎగ్జామినర్, అకడమిక్ అఫైర్స్ డీన్ గా, ప్రిన్సిపాల్ గా, రిజిస్ట్రార్ గా బాధ్యతలు గతంలో నిర్వర్తించారు.

రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య పి.సుజాత, 2010లో డా. బిఆర్ఏయూ బయోటెక్నాలజీ విభాగంలో అధ్యాపకురాలిగా కెరీర్ మొదలుపెట్టారు. బయోటెక్నాలజీలో ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి 2005లో డాక్టరేట్ పొంది, 2006-08 మధ్యలో, అమెరికాలోని షికాగో యూనివర్శిటీలో కేన్సర్ బయోలజీ మరియు ఇమ్యూనాలజీ అంశంలో పోస్ట్ డాక్టరేట్ ఫెలోగా అధ్యయనం చేశారు. 2018లో ఉత్తమ అధ్యాపకురాలి అవార్డును రాష్ట్ర ప్రభుత్వం మరియు డా. బిఆర్ఏయూల నుంచి, 2022లో ఉత్తమ పరిశోధకరాలి అవార్డు (స్నాతకోత్సవ)ను డా. బిఆర్ఏయూ నుంచి అందుకున్నారు. వర్శిటీ పాలకమండలి సభ్యురాలిగా, ఐక్యూఏసి,  నాక్ సమన్వయకర్తలుగా, విభాగాధిపతిగా, సిడిసి డీన్ గా. స్పోర్ట్స్ విభాగవు డీన్ గా, ఇంజినీరింగ్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నవంబర్ లో డా.బిఆర్ఎయూ నిర్వహించిన ఏపీ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు విజయవంతంలో కీలకంగా వ్యవహరించారు.

రెక్టార్ గా ఆచార్య బి. అడ్డయ్య, రిజిస్ట్రార్ గా ఆచార్య పి. సుజాత నియామకం పట్ల వర్శిటీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు కలిసి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

మీడియా రిలేషన్స్, డా. బిఆర్ఏయూ.

➡️