అచ్చెన్న, అయ్యన్నకు ఇసి నోటీసులు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సోషల్‌ మీడియా వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పార్టీ నేత అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల కమిషన్‌కు వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్‌ 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
అభ్యర్థుల కేసుల వివరాలివ్వండి

 డిజిపికి టిడిపి నాయకుల వినతి

రానున్న ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఏ స్టేషన్‌లో ఏమేమి కేసులు ఉన్నాయో వాటి వివరాలు చెప్పాలని టిడిపి నేతలు కోరారు. ఈ మేరకు డిజిపి కె రాజేంద్రనాథ్‌రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలిసి కోరారు. అనంతరం ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. నామినేషన్ల సందర్భంగా తమ పార్టీ అభ్యర్థులు కేసుల వివరాలు ఇసికి సమర్పించాల్సి ఉన్నందున వాటి వివరాలు ఇవ్వాలని కోరారు. 2021లో తమ పార్టీ కార్యాలయంపై దాడి జరిగితే ఇప్పటి వరకు ఒక్కర్ని కూడా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్‌కు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై అమర్యాద, అసభ్య పదజాలాల తో దుష్ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

టిడిపి కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి
మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు టిడిపి కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

టిడిపిలోకి పలువురు
టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సమక్షంలో పలు జిల్లాలకు చెందిన నేతలు టిడిపిలో చేరారు. గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్‌ తాడిశెట్టి మురళీమోహన్‌ తన అనుచరులతో టిడిపి కండువా కప్పుకున్నారు. అనంతపురం నగర వైసిపి మాజీ అధ్యక్షులు జయరామ్‌ నాయుడు, అనంతపురం రూరల్‌ మాజీ ఎంపిపి హేమలత తదితరులు టిడిపి గూటికి చేరారు. పెన్షనర్లను వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూస్తున్నారని లోకేష్‌ ఈ సందర్భంగా అన్నారు.

➡️