సిఎం జగన్‌కు ఇసి నోటీసులు

Apr 7,2024 22:12 #2024 elections, #ap cm jagan

48 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఉల్లంఘనపై 48 గంటల్లో సమాధానం చెప్పాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదివారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మదనపల్లె, పూతలపట్టు, నాయుడుపేటలో ఈ నెల 2, 3, 4 తేదీల్లో ఏర్పాటు చేసిన సిద్ధం ఎన్నికల సభల్లో పశుపతి, శాడిస్టు, చంద్రముఖి అంటూ టిడిపి అధినేత చంద్రబాబుపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఈ నెల 5న మీనాకు ఫిర్యాదు చేశారు. ‘అవ్వతాతలు పెన్షన్‌ అందుకోలేక 31 మంది చనిపోయారని, వీరిని చంపిన చంద్రబాబును హంతకుడు అందామా? లేకపోతే అంతకన్నా దారుణమైన పదం ఉంటే అందామా?’ అని నాయుడుపేటలో జగన్‌ చేసిన వ్యాఖ్యలనూ షోకాజ్‌ నోటీసుల్లో పేర్కొంది. ఈ అంశాలపై 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని జగన్‌ను ఇసి ఆదేశించింది. నోటీసులతోపాటు వర్ల రామయ్య లేఖను కూడా జత చేసింది.

➡️