‘ఆ’ జిల్లాలకు కొత్త ఉన్నతాధికారులు

  • గుంటూరు రేంజ్‌ ఐజిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి
  • సిఇసి ఉత్తర్వులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పలు జిల్లాల్లో ఇటీవల బదిలీ వేటు వేసిన ఉన్నతాధికారుల స్థానంలో నూతన అధికారులను ఎన్నికల కమిషన్‌ నియమించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా 2015వ సంవత్సరపు బ్యాచ్‌కు చెందిన డి.కె. బాలాజీని, అనంతపురం జిల్లా కలెక్టరుగా డాక్టర్‌.వి.వినోద్‌కుమార్‌ (2015 బ్యాచ్‌), తిరుపతి జిల్లా ఎన్నికల అధికారిగా ప్రవీణ్‌ కుమార్‌ (2006 )ను నియమించింది. ప్రకాశం ఎస్‌పిగా సుమిత్‌ సునీల్‌, పల్నాడు ఎస్‌పిగా బిందు మాధవ్‌, చిత్తూరు ఎస్‌పిగా వి.ఎన్‌. మణికంఠ చందోలు, అనంతపురం ఎస్‌పిగా అమిత్‌ బర్దార్‌, నెల్లూరు ఎస్‌పిగా కె. ఆరిఫ్‌ హఫీజ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గుంటూరు రేంజ్‌ ఐజిగా (2006 బ్యాచ్‌) సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమితులయ్యారు. వీరిని తక్షణమే బాధ్యతల్లో చేరాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధులను సరిగా నిర్వహించకపోవడం, అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరించడం తదితర కారణాలతో వీరికి ముందున్న అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. బదిలీ అయిన వారి స్థానంలో నూతన నియమాకాల కోసం ప్రతి పోస్టుకూ ముగ్గురితో కూడిన ప్యానల్‌ వివరాలను పంపించాలని ఈ నెల 2వ తేదీనే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 27 మంది పేర్లతో (9 మంది ఐఎఎస్‌, 18 మంది ఐపిఎస్‌) జాబితాను పంపించింది. తదనంతరం ఆయా అధికారుల వార్షిక పనితీరు అంచనా నివేదిక (ఎపిఎఆర్‌), విజిలెన్స్‌ క్లియరెన్స్‌ తదితర అంశాలు పరిశీలించిన ఎన్నికల సంఘం తాజా నియామకాలు చేసింది.

➡️