గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టుకు ఈసీ నివేదిక

May 1,2024 13:31 #AP High Court, #judgement

అమరావతి: గాజు గ్లాసు గుర్తు కేటాయింపు అంశంపై హైకోర్టుకు ఎన్నికల సంఘం (ఈసీ) నివేదిక సమర్పించింది. జనసేన పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాలు (దాని పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లలోనూ), అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇతరులకు ఆ గుర్తు కేటాయించబోమని ఈసీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తొలగుతాయని అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు.. విచారణను ముగించింది.
తమ పార్టీ పోటీలో లేనిచోట్ల స్వతంత్రులకు ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయించొద్దంటూ హైకోర్టును జనసేన ఆశ్రయించిన విషయం తెలిసిందే. మంగళవారం దీనిపై విచారణ జరిగింది. 24 గంటల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశారు హైకోర్టుకు తెలిపారు. ఆ మేరకు నేడు ఈసీ నివేదిక అందజేసింది.

➡️