ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోన్న ఇసి : సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ ఎలాంటి కారణాలు చూపకుండానే ఉద్యోగుల మనోస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరించడం తగదని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తప్పుడు ఆరోపణలతో విపక్షాలు ఫిర్యాదులు చేయగానే విచారణ లేకుండా ఐఎఎస్‌, ఐపిఎస్‌లపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి పాల్గొన్న సభను టిడిపి, బిజెపి, జనసేన కలిసి నిర్వహించాయని, కేంద్ర బలగాల రక్షణలో ప్రధాని పర్యటన జరిగితే రాష్ట్ర పోలీసులను బాధ్యులను చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు, పురందేశ్వరి వైఫల్యాన్ని రాష్ట్ర పోలీసులపై రుద్దే ప్రయత్నం చేశారని విమర్శించారు. కూటమిలో ఉన్నారు కాబట్టే పైనుంచి ఒత్తిడి చేయించి మరీ అధికారుల్ని బదిలీ చేయించారని విమర్శించారు. వలంటీర్ల వ్యవస్థలో మొదటి రోజునే 80 శాతం పెన్షన్లు లబ్ధిదారులకు అందేవని, ఇప్పుడు రెండు రోజులు గడిచినా 60 శాతం మాత్రమే పంపిణీ జరిగిందని తెలిపారు.

➡️