‘సర్దుబాటు’ తప్పదు

Mar 12,2024 00:15 #APERC, #Electricity tariff, #released
  • రైల్వేలకు యూనిట్‌కు రూపాయి పెంపు
  • విద్యుత్‌ టారిఫ్‌ విడుదల చేసిన ఎపిఇఆర్‌సి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ వినియోగదారులపై వచ్చే ఆర్ధిక సంవత్సరంలో కూడా ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ కాస్ట్‌ అడ్జస్ట్‌మెంట్‌ (ఎఫ్‌పిపిసిఎ) ((ఇంధన కొనుగోలు సర్దుబాటు ఛార్జీలు)) భారం పడనుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం నుంచి ప్రతి నెల వినియగదారుల నుంచి రెండు ఎఫ్‌పిపిసిఎ చార్జీలను, ఒక ట్రూఅప్‌ చార్జీలను వసూలు చేస్తూ మూడు భారాలను వినియోగదారుల నుంచి పిండితున్నాయి.ఎఫ్‌పిపిసిఎ యూనిట్‌కు 40పైసలు తగ్గకుండా డిస్కంలు వసూలు చేశాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో మూడు డిస్కంలు సుమారు రూ.5000కోట్లు ఎఫ్‌పిపిసిఎ రూపంలో వసూలు చేశాయి. వచ్చే ఆర్ధిక సంవత్సరం కూడా ఎఫ్‌పిపిసిఎ చార్జీల భారం వినియోగదారులపై ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఎపిఈఆర్‌సి) చైర్మన్‌ జస్టిస్‌ సివి నాగార్జున రెడ్డి వెల్లడించారు. అయితే ఈ భారం సాధ్యమైన మేరకు తక్కువ చేసి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా టారీఫ్‌ రూపొం దించామని తెలిపారు. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్‌ టారీఫ్‌ను సోమవారం విజయవాడలో విడుదల చేశారు. గృహా వినియోగదారులపై ఎలాంటి భారం మోపలేదని చెప్పిన చైర్మన్‌ ఎఫ్‌పిపిసిఎ చార్జీలు కొనసాగుతాయని చెప్పారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలకు సకాలంలో రాష్ట్రప్రభుత్వం చెల్లించాలని, చెల్లింపులు ఆలస్యమయితే వడ్డీ చెల్లించాల్సి ఉంటుందనే నిబంధనను 2024-25 విద్యుత్‌ టారీఫ్‌లో పొందుపరిచామని తెలిపారు. రైల్వేకు డిస్కంలు ప్రస్తుతం అందిస్తున్న టారీఫ్‌ను రూ.5.50ల నుంచి రూ.6.50లకు పెంచేందుకు అనుమతి ఇచ్చిన్నట్లు తెలిపారు. వార్షిక ఆదాయ అవసరాలుగా డిస్కంలు రూ.56,573.03 కోట్లు ప్రతిపాదించాయని, ఇందులో రూ.56,501.81కోట్లకు అనుమతి ఇచ్చిన్నట్లు చెప్పారు. ఆదాయ లోటును డిస్కంలు రూ.13,624.67కోట్లుగా చూపా యని తెలిపారు. డిబిటి, ఇతర సబ్సిడీలు కూడా కలుపుకుంటే లోటు రూ.15,299.18 కోట్లుగా కమిషన్‌ నిర్ణయించిందన్నారు. ఈ మొత్తం లోటును చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తమకు లేఖ ద్వారా తెలిపిం దన్నారు. గ్రీన్‌ టారిఫ్‌ను రూ.1కు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదననుఆమోదించ లేదని చెప్పారు. విద్యుత్‌ వాహన చార్జీంగ్‌, స్టేషన్లకు అందించే విద్యుత్‌ సేవా ఖర్చును పెంచాలన్న ప్రతిపాదనను కూడా అంగీకరించలేదన్నారు. సగ్గు బియ్యం మిల్లులను సీజనల్‌ పరిశ్రమల విభాగంలో చేర్చిన్నట్లు చెప్పారు. పౌల్ట్రీ క్షేత్రాలు కార్యకలాపాలకు అనుబంధంగా ఉన్న కార్యాలయం, సిబ్బంది క్వార్టర్స్‌ విద్యుత్‌ వినియోగంలో 5శాతం పౌల్ట్రీ కేటగిరి కింద అనుమతించిన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎపిఇఆర్‌సి సభ్యులు ఠాకూర్‌ రామసింగ్‌, పి వెంకట రామరెడ్డి, జెన్‌కో ఎండి కెవిఎన్‌ చక్రధర్‌ బాబు, ఎపిసిపిడిసిఎల్‌ సిఎండి కె సంతోష్‌ రావు పాల్గొన్నారు.

➡️