అంగన్‌వాడీలపై ఎస్మా

esma on anganwadi workers in ap ycp govt
  • వేతనాల్లో కోత 
  • బెదిరేది లేదు : సంఘాలు 
  • భగ్గుమన్న కార్మికలోకం 
  • వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు ఖండన

ప్రజాశక్తి – అమరావతి : అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సమస్యలను పరిష్కరించడానికి బదులుగా క్రౌర్యాన్ని చూపింది. పెరిగిన ధరలతో బతకడం కష్టంగా ఉందంటూ పదేపదే విజ్ఞప్తి చేసినా స్పందించని సర్కారు మరోమార్గం లేక సమ్మె బాట పట్టిన అంగన్‌వాడీలను బలప్రయోగంతో అణచివేయడానికి సిద్ధమైంది. 26 రోజులుగా శాంతియుతంగా సాగుతున్న సమ్మెపై ఎస్మా (ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటెనెన్స్‌ యాక్టు -అత్యవసర సేవల నిర్వహణ చట్టం)ను ప్రయోగించింది. ఈ మేరకు జిఓ నెంబర్‌2ను శనివారం విడుదల చేసింది. సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ అక్క, చెల్లెమ్మల జీతాల్లో కోతలు పెట్టడం ద్వారా ప్రభుత్వం వారి పొట్టకొట్టింది .సమ్మెకాలానికి సుమారు 3,450 రూపాయలను తగ్గించి అంగన్‌వాడీ వర్కర్ల, హెల్పర్ల జీతాలను శనివారం వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ పరిణామం పట్ల అంగన్‌వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు భయపడేది, బెదిరేది లేదని, మరింత పట్టుదలతో సమ్మెను కొనసాగిస్తామని అంగన్‌వాడీ సంఘాలు ప్రకటించాయి. గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్న ప్రభుత్వానికి ఎస్మా ప్రయోగించే అధికారం ఎక్కడిదని ప్రశ్నించాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెంబర్‌ 2 ప్రతులను దగ్ధం చేశాయి. అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడం పట్ల కార్మికసంఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రభుత్వ తీరు ఇదే మాదిరి కొనసాగితే ప్రజలు బుద్దిచెబుతారని హెచ్చరించాయి తెలుగుదేశం, సిపిఎం, సిపిఐలు ప్రభుత్వ చర్యను ఖండించాయి. ఎస్మా ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి.

  • జిఓలో ఏముంది?

అంగన్‌వాడీ సేవలను అత్యవసర సేవల కిందకు తీసుకువస్తున్నట్లు జిఓ నెంబర్‌2లో ప్రభుత్వం తెలిపింది. ‘అంగన్‌వాడీ సేవలను అత్యవసర సర్వీసులుగా భావిస్తున్నందున ఆరు నెలల పాటు సమ్మెలు, ఆందోళనలు, నిరసనలు నిషేధిస్తున్నాం’ అని పేర్కొంది. 2013 జాతీయ ఆహార భద్రత చట్టం లోని సెక్షన్‌ 39 కింద అంగన్‌వాడీలు అత్యవసర సర్వీసుల కిందకు వస్తారని పేర్కొన్న ప్రభుత్వం, 1971 అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద సమ్మెను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి సమ్మెను కొనసాగిస్తే అంగన్‌వాడీలను డిస్మిస్‌ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది.

  • ఘనమైన పోరాట చరిత్ర

సమ్మెను అణచివేయడానికి ఎస్మాను ప్రయోగించిన రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకున్న పోరాట చరిత్రను విస్మరించడం గమనార్హం. మన రాష్ట్రంలో అంగన్‌వాడీలు ఎదుర్కున్న నిర్బంధాన్ని, దానిని అధిగమించిన తీరును ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా, ఏమాత్రం వెనకడుగు వేయక పోరాటాలను కొనసాగించి సమస్యలను పరిష్కరించుకున్నారు. ఎస్మా విధించిన నేపథ్యంలో ఈ పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ పోరాట శిబిరాల్లో శనివారం చర్చకు వచ్చాయి. ఆ స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని, వెనకడుగు వేసేది లేదని అంగన్‌వాడీలు ఎక్కడికక్కడ ప్రకటించారు.

➡️