వైసిపికి శింగనమల మాజీ ఎమ్మెల్యే రాజీనామా

Apr 6,2024 21:40 #resigns, #Singanamala MLA, #YCP

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం):వైసిపికి అనంతపురం జిల్లా శింగనమల మాజీ ఎమ్మెల్యే యామినీ బాల శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ‘తాను వైసిపికి రాజీనామా చేస్తున్నాను. ఇంత కాలం తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు’ అని వీడియోలో పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరుపున యామినీ బాల ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంతో ఆమె పోటీ చేయలేదు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తన తల్లి మాజీ ఎమ్మెల్సీ శమంతకమణితో కలిసి ఆమె వైసిపిలో చేరారు.
వైసిపి శింగనమల టికెట్‌ వ్యవహారంపై గత నెల రోజులుగా ఆ పార్టీలో తీవ్ర అసమ్మతి నెలకొంది. వీరాంజినేయులకు టికెట్‌ ఇవ్వడాన్ని యామినిబాలతో సహా అసమ్మతి నేతలు నిరసిస్తున్నారు. అభ్యర్థిని మార్చాలంటూ పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అయినా అభ్యర్థిని మార్చకపోవడంతో అసమ్మతి నేతలు ఇప్పటికే రాజీనామా చేస్తామని ప్రకటించారు. తాజాగా యామినీబాల కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరికొందరు కూడా త్వరలో రాజీనామాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

➡️